'బొల్లారం' నిందితుడికి రిమాండ్, ఎమ్మెల్యేపై కేసు నమోదు!
హైదరాబాద్: నగర శివారులోని బొల్లారంలో భారీగా పట్టుబడ్డ డబ్బు కేసులో నిందితుడు రాజమౌళిని పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో విజయరమణారావుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
నిందితుడు రాజమౌళికి డబ్బు నాగరాజు అనే వ్యక్తి అందచేసినట్టు, ఆతర్వాత డబ్బు రాజమౌళికి ఇచ్చినట్లు విజయరమణారావుకు నాగరాజు ఫోన్ చేసి చెప్పినట్టు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో వివరాలను సేకరించడానికి రాజమౌళి సెల్ పోన్ కాల్‌డేటాపై పోలీసులు దృష్టి సారించారు.
కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు వ్యక్తిగత సహాయకుడు రాజమౌళిచారి అలియాస్ రమేశ్ రూ.90 లక్షల నగదును తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పంచిపెట్టేందుకే తెలుగు తమ్ముళ్లు ఈ నగదు తరలిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం విజయరమణారావు పెద్దపల్లి నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు.