చైనాలోని ఓ రైల్వేస్టేషన్లో పేలుడు
* పదుల సంఖ్యలో ప్రయాణికులకు గాయాలు
బీజింగ్: చైనాలో ముస్లింలు అధికంగా నివసించే జిన్జియాంగ్ ప్రావిన్సులో ఉన్న ఓ రైల్వేస్టేషన్లో బుధవారం శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఉరుమ్కీ స్టేషన్ వెలుపల ద్వారం వద్ద జరిగిన ఈ పేలుడులో 50 ప్రయాణికులు గాయపడ్డారు. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి అంబులెన్సులు, పోలీసు వాహనాలు చేరుకున్నాయి. తీవ్రవాద దాడులతో అట్టుడికే ఈ ప్రావిన్సులో దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ పర్యటన ముగిసే క్రమంలో ఈ పేలుడు జరిగింది.
పేలుడు నేపథ్యంలో రంగంలోకి దిగిన భద్రతా దళాలు స్టేషన్లో క్షుణ్ణంగా తనఖీలు చేపట్టి స్టేషన్ను తిరిగి తెరిచాయి. ఇస్లామిక్ మిలిటెంట్ల దాడులతో గత కొంతకాలంగా ఈ ప్రాంతం అట్టుడుకుతోంది. యుగుర్ ముస్లింలు, ఇతర ప్రావిన్సుల నుంచి వచ్చి స్థిరపడిన హాన్ చైనీయులకు మధ్య కొన్నేళ్లుగా జాతి విద్వేషాలు రగులుతున్నాయి.