బీజేపీ నేత ఇంటికి బాంబు పార్సిల్
చెన్నై: బీజేపీ తమిళనాడు అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఇంటికి బాంబు పార్సిల్ రావడం సంచలనం రేపింది. దీంతో పాటు హత్యా బెదిరింపు లేఖ ఉండడం తీవ్ర కలకలం సృష్టించింది. పశుమాంసం విక్రయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమెను దుండగులు హెచ్చరించారు. మాంసం కోసం పశువులను విక్రయించడంపై కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం కఠిన నిబంధనలు విధించిన విషయం తెలిసిందే.
కేంద్రం నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తుండడంతో ఆమెకు ఈనెల 2న బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. దీనిపై విరుగంబాక్కం పోలీసుస్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. కాగా, విరుగంబాక్కంలో గల తమిళిసై సౌందరరాజన్ ఇంటికి మంగళవారం మధ్యాహ్నం పార్శిల్ వచ్చింది. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చిన తమిళిసై దీన్ని చూశారు. పార్శిల్లో ఉన్న బ్యాక్స్‌లో బాంబు తయారీ పదార్థాలు, వత్తి కనిపించాయి. పశుమాంసం విక్రయాలపై వ్యతిరేకంగా మాట్లాడితే సహించమని అసభ్య పదజాలంతో ఉన్న లేఖ కూడా ఉంది. దీంతో పోలీసులు ఆమె ఇంటికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన మరో బెదిరింపు లేఖలో తమిళిసై సౌందరరాజన్ ప్రసంగాలు ఆపాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని దుండగులు హెచ్చరించారు.