‘గోకుల్’ మృతులకు నివాళి
సుల్తాన్‌బజార్: గోకుల్‌చాట్, లుంబిని పార్క్ జంట బాంబు పేళ్లులు జరిగి సోమవారం నాటికి 7ఏళ్లు నిండాయి. హైదాబాద్‌కు మాయని మచ్చగా నిలిచిన ఈ సంఘటనకు కోఠి గోకుల్‌చాట్, లుంబినీపార్క్లు సాక్షిగా మారాయి. కోఠి గోకుల్‌చాట్ వద్ద బాంబుపేళ్లుల్లో మృతి చెందిన మృతులకు బీజేపీ, సీపీఐ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల నాయకులతో పాటు విద్యార్థులు, స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు సోమవారం గోకుల్‌చాట్ వద్ద నివాళులర్పించారు.
వీహెచ్‌పి, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో...
ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని విశ్వహిందూపరిషత్, భజరంగ్‌దళ్‌లు డిమాండ్ చేశాయి. బాంబు దాడుల్లో మృతిచెందిన వారి ఆత్మశాంతి కోసం సోమవారం కోఠిలోని గోకుల్చాట్వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళుర్పించారు. ఈ సందర్భంగా వీహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి గాల్‌రెడ్డి మాట్లాడుతూ సంఘటన జరిగి ఏడేళ్లు పూర్తి కావస్తున్నా బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవాలని కోరారు. బాధితులకు రూ.20లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ఆకారపు కేశవరావు, భజరంగ్‌దళ్ రాష్ట్ర కన్వీనర్ వై.భానుప్రకాష్ఐ భరత్‌వంశీ, యమన్సింగ్తో పాటు పెద్ద ఎత్తున వీహెచ్‌పి, భజరంగ్‌దళ్ నాయకులు పాల్గొన్నారు.
బాధితుడు రెహ్మతుల్లా నివాళి...
కోఠి గోకుల్‌చాట్ వద్ద గత ఏడేళ్ల క్రితం చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో బాధితుడు రెహ్మతుల్లా తీవ్రంగా గాయపడి ఒక కన్నును కోల్పోయాడు. కుమార్తెకు ఐస్‌క్రీమ్ తీసుకురావడానికి వెళ్లిన రెహ్మతుల్లా పేలుళ్ల బారిన పడ్డానని కంటతడిపెట్టుకున్నాడు. తన చికిత్స కోసం ఇప్పటి వరకు లక్షల్లో డబ్బులు వెచ్చించానని వాపోయాడు. పెయింటర్‌గా పనిచేసే తాను వైద్య ఖర్చుల కోసం స్వగ్రామమైన ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలో ఉన్న భూములను అమ్ముకున్నానన్నాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఇప్పటికైనా టీ సర్కార్స్పందించి తనకుసహాయం చేయాలని కోరాడు.
నగరంలో ఉగ్ర’ మూలాలు : కిషన్‌రెడ్డి
లుంబినీ పార్క్ మృతులకు బీజేపీ నేతల నివాళి
ఖైరతాబాద్: ఉగ్రవాదం పెను సవాలుగా మారిందని, దేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా దాని మూలాలు హైరదాబాద్ నగరంలో బయట పడుతుండటం ఆందోళన కలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం లుంబినీపార్క్‌లో బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, నగర నాయకుడు వెంకట్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు లుంబినీ, గోకుల్‌చాట్ వద్ద జరిగిన బాంబుదాడుల్లో మృతి చెందిన వారికి ఘనంగా నివాళులర్పించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఎంపీ బండారు దత్తాత్రేయ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బద్దం బాల్‌రెడ్డి, ఆలె జితేంద్ర, లాయక్ అలీ తదితరులు పాల్గొని మృతుల కుటుంబాలకు నివాళులు అర్పించారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు.