‘అనూహ్య’ కేసులో నిర్లక్ష్యం తగదు
సాక్షి, ముంబై: తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవులు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘బాంబే క్యాథలిక్ సభ’ ఆధ్వర్యంలో కొనసాగిన ఈ ర్యాలీకి విక్రోలి విభాగం అధ్యక్షుడు రాబర్ట్ డిసౌజా నేతృత్వం వహించారు. విక్రోలి నుంచి నుంచి ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే మీదుగా ముందుకు సాగింది. సుమారు 300 మందితో శాంతియుతంగా ముందుకు సాగిన ఈ ర్యాలీ సుమారు 45 నిమిషాల అనంతరం కాంజూర్ మార్గ్-భాండూప్ మధ్యలో సర్వీస్ రోడ్డుకు పక్కనే అనూహ్య మృతదేహం లభించిన ఘటనాస్థలికి చేరుకుంది. అనంతరం అక్కడ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించడంతోపాటు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అనూహ్య కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వీరు ఆరోపించారు. మృతదేహం లభించి వారం రోజులుగా గడుస్తున్నా ఇప్పటివరకు నిందితుల ఆచూకీ కూడా పోలీసులు తెలుసుకోలేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆందోళన మరింత ఉధృతం చేస్తాం...
అనూహ్యను హత్య చేసిన నిందితులను తొందరగా పట్టుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని బాంబే క్యాథలిక్ సభ విక్రోలి విభాగం అధ్యక్షుడు రాబర్ట్ డిసౌజా పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర రైల్వేమంత్రికి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ర్యాలీలో రాబర్ట్ డిసౌజాతోపాటు ఫాదర్ సైమన్ లాఫీస్, ములూండ్ విభాగం అధ్యక్షుడు రానీ టెస్లర్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే పోలీసుకు వినతిపత్రం...
నిరసన ర్యాలీ అనంతరం కుర్లా రైల్వే పోలీసు సీని యర్ ఇన్స్పెక్టర్ శివాజీధుమాల్కు సభ ప్రతినిధుల బృందం ఓ వినతి పత్రాన్ని అందచేసింది. దర్యాప్తును వేగవంతం చేయడంతోపాటు వెంటనే నింది తులను అరెస్టు చేయాలని అందులో పేర్కొన్నారు.