'అమెరికాది అబద్ధం.. మేం బాంబులేయలేదు'
మాస్కో: తాము సిరియా ఆస్పత్రులను బాంబులేసి కూల్చామంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలు కేవలం ఆరోపణలు మాత్రమే రష్యా కొట్టి పారేసింది. అవన్నీ ఊహాగానాలే అని పేర్కొంది. అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్బీ శుక్రవారం మాట్లాడుతూ బుధవారంనాడు రష్యా సిరియా బలగాలు ఉమ్మడిగా సిరియాలో ఐదు ఆస్పత్రులు, ఒక మొబైల్ క్లినిక్ పై బాంబు దాడులు చేశాయని ఆరోపించారు.
వీటిని రష్యా తాజాగా కొట్టి పారేసింది. తమ దేశ సేనలను తప్పుబట్టడాన్ని రష్యా రక్షణశాఖ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెన్కోవ్ ఖండించారు. జాన్ కిర్బీ చెప్పేదంతా కేవలం ఊహల ద్వారా చేసిన వ్యాఖ్యానాలని అన్నారు. గత 30 రోజులుగా తాము సిరియాలో ఎలాంటి వైమానిక దాడులు నిర్వహించడం లేదని స్పష్టం చేశారు.