రైల్వే కార్మికులకు శుభవార్త
-2014-15 నాటి బోనస్ బకాయి మంజూరు
కాజీపేట రూరల్ : కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికులకు 2014-15 సంవత్సరం నాటి బోనస్ పాత బకాయిలను మంజూరు చేసింది. ఈ మేరకు కాజీపేట రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో శుక్రవారం రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ జోనల్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్, కాజీపేట మజ్దూర్ యూనియన్ కోఆర్డినేటర్ పి.రవిందర్ విలేకరులతో మాట్లాడారు. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ఢిల్లీ నేతృత్వంలో రైల్వే కార్మికులకు రూ.3,500 సీలింగ్‌తో బోనస్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేయగా కేంద్రం పార్లమెంట్లో బోనస్ చట్టం ఆమోదించి రూ.7,000 సీలింగ్‌తో బోనఽఽస్ ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు.
దీంతో 2014-15 సంవత్సరం 78 రోజుల బోనస్‌కు రూ.7000 సీలింగ్‌తో రూ.17,951లు మంజూరు చేసిందని చెప్పారు. గత సంవత్సరం బోనస్‌లో రూ.8,975 రైల్వే కార్మికులు తీసుకున్నారని, మిగిలిన బకాయి బోనస్‌ను రూ.8,975 అక్టోబర్ నెల వేతనంలో రైల్వే కార్మికులకు రానున్నట్లు తెలిపారు. 2015-16 సంవత్సరానికి గాను ప్రతి దసరా పండుగకు అనవాయితీగా రైల్వే కార్మికులకు ఇచ్చే బోనస్ రైల్వే శాఖ ఇంక ప్రకటించలేదని, త్వరలో రూ.7,000 సీలింగ్ పద్ధతిన బోనస్‌ను కేంద్రం మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏఐఆర్ఎఫ్ కృషి ఫలితంగానే కార్మికులకు పాత బకాయి బోనస్ మంజూరు అయిందని తెలిపారు.
-రైల్వే కార్మికులకు మరో రెండు రెఫరెల్ ఆస్పత్రులు
కాజీపేట రైల్వే ఆస్పత్రి కేంద్రంగా వైద్యం అందుకుంటున్న రైల్వే కార్మికులకు నగరంలో మరో రెండు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను రెఫరెల్‌గా చేయాలని సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని శ్రీనివాస్ తెలిపారు. త్వరలో ఈ రెండు ఆస్పత్రులకు సంబంధించిన అనుమతి కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు వెళ్లాయని, కొద్ది రోజులలో బోర్డు అనుమతి పొంది రెండు రెఫరెల్ ఆస్పత్రులు మంజూరు కానున్నాయని చెప్పారు.