ఆసీస్‌కు ‘బోనస్’ పాయింట్
సిడ్నీ: ముక్కోణపు వన్డే టోర్నీని ఆస్ట్రేలియా బోనస్ పాయింట్ విజయంతో ఘనంగా ప్రారంభించింది. శుక్రవారం సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటయింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (136 బంతుల్లో 121; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో అద్భుతమైన సెంచరీ చేశాడు.
69 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయినా... బట్లర్ (28), జోర్డాన్ (17)ల అండతో మోర్గాన్ గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్‌కు నాలుగు, ఫాల్క్‌నర్‌కు మూడు వికెట్లు దక్కాయి. తర్వాత ఆస్ట్రేలియా జట్టు 39.5 ఓవర్లలో ఏడు వికెట్లకు 235 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ వార్నర్ (115 బం తుల్లో 127; 18 ఫోర్లు) మూడేళ్ల తర్వాత వన్డేల్లో సెం చరీ చేశాడు. స్టీవ్ స్మిత్ (37) రాణించాడు.
మిగిలిన ప్రధాన బ్యాట్స్‌మెన్ పెద్దగా ఆకట్టుకోకపోయినా... వార్నర్ మెరుపులతో ఆసీస్ వేగంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ బౌలర్ వోక్స్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మూడు బంతుల్లో రెండు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ స్టార్క్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 40 ఓవర్లలోపు గెలిస్తే జట్టుకు బోనస్ పాయింట్ దక్కుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ద్వారా ఆసీస్‌కు 5 పాయింట్లు లభించాయి.