గ్రంథా‘లయ’తప్పుతోంది
ఒంగోలు: పఠనా కేంద్రాలుగా పరిఢవిల్లాల్సిన గ్రంథాలయాలు జిల్లాలో దీనావస్థలో నడుస్తున్నాయి. జిల్లాలో 65 మండల, 12 గ్రామీణ గ్రంథాలయాలుంటే వాటిలో కేవలం 25 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలున్నాయి. వీటిలో కూడా సగం గ్రంథాలయాలు గత పదేళ్లలో నిర్మించినవే కావడం గమనార్హం. 28 ఏళ్ళుగా నూతన శాఖ ఒక్కటి కూడా ప్రారంభం కాలేదంటే గ్రంథాలయాల పట్ల పాలకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒక పక్క ఎయిడెడ్ గ్రంథాలయమైన వేటపాలెం సారస్వత విద్యానికేతన గ్రంథాలయం జాతి యావత్తు ప్రశంసలు అందుకుంటుండగా మరోవైపు ఫ్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గ్రంథాలయాలు మాత్రం రోజురోజుకూ పాఠకాదరణకు దూరమవుతున్నాయి. జిల్లాలో 65 గ్రంథాలయాలున్నాయి. వాటిలో గ్రేడ్ -1 కేటగిరీలో మార్కాపురం గ్రంథాలయం ఉండగా, మరో నాలుగు గ్రేడ్-2, అరవై గ్రంథాలయాలు గ్రేడ్-3 పరిధిలోనున్నాయి. ఇవి కాకుండా 12 గ్రామీణ గ్రంథాలయాలున్నాయి. జిల్లాలో చివరిగా గ్రంథాలయం ఏర్పాటైంది 1986లో కావడం గమనార్హం. అంటే 28 ఏళ్లుగా కనీసం ఒక్క నూతన శాఖ కూడా ప్రారంభం కాకపోవడాన్ని పరిశీలిస్తేనే గ్రంథాలయాల పట్ల ఎంతటి చిన్నచూపుందో అర్థమవుతోంది.
అయితే ఈ సమస్యనుంచి తప్పించేందుకు బుక్ డిపాజిట్ సెంటర్లంటూ 48 ప్రారంభించినా అవి వాస్తవానికి నిరుపయోగమే. అధికారుల లెక్కల్లో ఉన్నట్లు చెబుతున్నా వాస్తవానికి అవి పనిచేస్తున్న దాఖలాలే లేవు. వారంలో శుక్రవారం మినహా అన్ని రోజులు పనిచేసే ఈ బుక్డిపాజిట్ సెంటర్లకు పంచాయతీ ఒక గదిని గ్రంథాలయ నిర్వహణ కోసం ఉచితంగా కేటాయించాలి. అందులో రోజుకు రెండు పత్రికలతోపాటు కొన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతారు. నెల రోజులపాటు కేవలం రూ.500లకోసం పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వీటి బాగోగులు చూసే నాథుడే కరవయ్యారు. 65 గ్రంథాలయాలలో సంతరావూరు, ముండ్లమూరు, మల్లవరం గ్రంథాలయాలు గ్రంథపాలకులు లేక ఏళ్ళ తరబడి మూతపడ్డాయి.
కనిగిరిలో రికార్డు అసిస్టెంటే ప్రస్తుతం ఇన్ఛార్జి గ్రంథపాలకునిగా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు ఈ ఏడాది రిటైరయ్యేవారున్నారు. ఇప్పటివరకు 25 గ్రంథాలయాలకు మాత్రమే సొంత భవనాలలో నడుస్తుండగా 15 గ్రంథాలయాలు మాత్రం అద్దె ఇళ్ళల్లో ఏర్పాటు చేశారు. మిగిలినవి మాత్రం ఎటువంటి అద్దె లేకుండా పంచాయతీ భవనాలలో నడుస్తున్నాయి. ప్రస్తుతం పొదిలిలో రూ.17 లక్షలు, వై.పాలెం, త్రిపురాంతకంలలోని గ్రంథాలయాలకు రూ.10 లక్షలు చొప్పున నిధులు వెచ్చించి సొంత భవనాలను నిర్మిస్తున్నారు. ఇక మార్కాపురంలో రూ.7.50 లక్షలు, కంభంలో రూ.5.50 లక్షలతో అదనపు భవనాల నిర్మాణం చేపట్టారు.
విజ్ఞాన కేంద్రాలపైనా విభజన భారం
రాష్ట్రం విడిపోవడంతో విజ్ఞాన కేంద్రాలైన గ్రంథాలయాలకు ఈ ఏడాది ఇప్పటివరకు బడ్జెట్ కేటాయింపులే జరగలేదు. సాధారణంగా కనీసం కోటి రూపాయల బడ్జెట్ ఉంటుంది. కానీ ఇంతవరకు బడ్జెట్ కేటాయించకపోగా రోజువారీ నిర్వహణ విషయంలో కూడా 50 శాతం ఖర్చు తగ్గించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అంటే పత్రికలు, మ్యాగజైన్లు, ఇంకా ఇతరత్రా అన్నింటిపైనా ఈ భారం పడింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేందుకు పెద్ద మొత్తంలో విద్యార్థులు వస్తుంటారు. రోజురోజుకు పెరుగుతున్న పోటీకి తగ్గట్లుగా అవసరమైన పుస్తకాలను గుర్తించి కొనుగోలుచేయాలి. కానీ నేడు పుస్తకాల కొనుగోలుకు అధికారులు వెనుకాడుతున్నారు.
వారోత్సవాల నిర్వహణకు కోతలే
సాధారణంగా గ్రంథాలయాల వారోత్సవాలకు ప్రభుత్వం ఇచ్చేదే మొక్కుబడి మొత్తం. అయితే ఈ ఏడాది అందులోను 50 శాతం కోతలు కోసేసింది. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి వారం రోజుల కార్యక్రమాల నిర్వహణకు రూ.25 వేలు కేటాయించేది. కానీ ఈ ఏడాది రూ.12 వేలతో సర్దుకొమ్మన్నారు. ఇక గ్రేడ్-1, గ్రేడ్-2 గ్రంథాలయాలకు రూ.5 వేలు గత ఏడాది కేటాయించగా ఈ ఏడాది కేవలం రూ.2,500 మాత్రమే. ఇక మిగిలిన గ్రంథాలయాలకైతే గత ఏడాది రూ.1500 కేటాయించగా ఈ ఏడాది ఆ మొత్తాన్ని కూడా రూ.700 కుదించారు.
ఈ కొద్దిపాటి మొత్తంతో వారం రోజులపాటు కార్యక్రమాల నిర్వహణే కాదు, నిర్వహించినట్లుగా ఆధారాలను, అన్ని రకాల బిల్లులను కూడా జిల్లా గ్రంథాలయానికి గ్రంథపాలకులు సమర్పించాల్సి రావడం గమనార్హం. ఈ మొత్తంలోనే కార్యక్రమాల నిర్వహణే కాదు...పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
కనిపించని కొత్త పుస్తకాల ఊసు
నవలల కోసం డబ్బులు వెచ్చించవద్దు...అన్నీ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలనే కొనుగోలుచేయాలంటూ రెండేళ్ల కిందటే సర్కారు హుకుం జారీ చేసింది. దీంతో పల్లెల్లో ఉన్న గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు రాకపోవడంతో సగం మంది పాఠకులు దూరమయ్యారు. ఆ తరువాత జిల్లాకు సంబంధించి పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. అయితే దీనికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అధ్యక్షతన జరగాలి. కానీ ఆ పదవి ఖాళీగా ఉండడంతో మరింత అవరోధంగా మారింది. దీంతో తగ్గిన పాఠకాదరణను పెంచేందుకు గ్రేడ్-1 గ్రంధాలయ అధికారి నెలకు 7, గ్రేడ్-2 గ్రంథపాలకుడు నెలకు 5, మిగిలిన గ్రంథపాలకులు నెలకు ముగ్గురు చొప్పున కొత్త పాఠకులను (నూతన సభ్యుని చందా రూ.50) పెంచాలంటూ లక్ష్యాలను నిర్థేశించడం విడ్డూరం.
కోటి రూపాయలకు పైగా సెస్ బకాయిలు: జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఆర్సీహెచ్.వెంకట్రావు
పంచాయతీలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు అన్నీ కలిపి కోటి రూపాయలకుపైగా బకాయి పడ్డాయి. ప్రజలు చెల్లించే ఇంటి పన్నులో 8 శాతం గ్రంథాలయ పన్ను ఇమిడి ఉంటుంది. ప్రజలు మీసేవ, లేదా ఈ సేవల ద్వారా చెల్లించిన సమయంలో సంబంధిత మొత్తం జిల్లా గ్రంథాలయ సంస్థకు జమవుతుంది.
ప్రజలు నేరుగా పంచాయతీ కార్యదర్శికి, మున్సిపాల్టీలలోని ఖజానా విభాగంలో చెల్లించిన సందర్భంలో మాత్రం గ్రంథాలయ పన్నుకు సంబంధించిన చెల్లింపులు గ్రంథాలయ శాఖ ఖాతాకు జమకావడంలేదు. కందుకూరు, మార్కాపురంల నుంచి వందశాతం పన్ను తమకు జమవుతుంది. కనిగిరి, అద్దంకి, చీమకుర్తి నగర పంచాయతీల నుంచి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తమ శాఖకు జమకాలేదు.