రైల్వే తత్కాల్ ప్రయాణీకులకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ ఊరట నిచ్చింది. ముఖ్యంగా అత్యవసరంగా ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు టికెట్‌ను ఆన్లైన్లో తక్షణం బుక్ చేసుకుని, పేమెంట్ తరువాత చేసే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటివద్ద చెల్లించే (పే ఆన్ డెలీవరీ) సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు బుధవారం ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్టీసీ) వెబ్ సైట్లో తత్కాల్ కోటా కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు డబ్బును తరువాత చెల్లించవచ్చని ఐఆర్సీటీసీ బుధవారం ప్రకటించింది. ఇంతవరకు, ఈ సేవ సాధారణ రిజర్వేషన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజా నిర్ణయం ద్వారా తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందుకోసం వినియోగదారులు irctc.payondelivery.co.in తో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ లేదా పాన్ వివరాలు జతచేయాలి. అలాగే టికెట్ బుకింగ్ చేస్తున్నప్పుడు పే-ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డిజిటల్ డెలివరీ ఎస్ఎంఎస్ / ఇ-మెయిల్ ద్వారా తక్షణమే జరుగుతుంది. 24 గంటల లోపు పేమెంట్ స్వీకరణ జరుగుతుంది. ఒకవేళ టికెట్ల డెలివరీ లోపు క్యాన్సిల్ చేసుకుంటే చట్ట ప్రకారం భారీ జరిమానా తప్పదు. అంతేకాదు ఐఆర్సీటీసీ ఖాతా శాశ్వతంగా క్లోజ్ అవుతుంది.
టికెట్లు తమ ఇంటి దగ్గర బట్వాటా చేయాలనుకుంటే, వినియోగదారులు నగదు, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ చెల్లింపు ప్రొడ్యూసర్ ఆండూరిల్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ పే డెలివరీ ఫీచర్ ద్వారా వినియోగదారులు కొన్ని సెకండ్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుందని ఆండూరిల్ టెక్నాలజీస్ సీఈవో అనురాగ్ బాజ్‌పాయ్ తెలిపారు. తద్వారా ఇది లక్షలాది మంది ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తత్కాల్ బుకింగ్ సమయంలో తరచుగా డబ్బు డెబిట్ అయినా, టికెట్ బుక్ కాకపోవడం, అలాగే డబ్బులు తిరిగి మన ఖాతాలోకి చేరడానికి కనీసం 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త ఈ లావాదేవీల వైఫల్యాలను తొలగిస్తుందని ఆయన వివరించారు.
కాగా ఐఆర్సీటీసీ రోజువారీ లక్షా 30వేల తత్కాల్ లావాదేవీలను నిర్వహిస్తుంది. అయితే ఈ టికెట్ల మెజారిటీ కోటా ప్రారంభపు నిమిషాల్లోనే ఖతం కావడం కూడా తెలిసిందే.