‘సిక్కింను భారత్ నుంచి విభజించాలి’
ప్రత్యేక దేశంగా సిక్కిం డిమాండ్‌కు మద్దతునివ్వాలి
చైనా మీడియా కుతంత్రపు రాతలు
బీజింగ్: సిక్కిం సెక్టార్లో రోడ్డు నిర్మాణం విషయమై భారత సైనికులతో ఘర్షణ మొదలైన నాటినుంచి చైనా మీడియా కుతంత్రపు రాతలు కొనసాగిస్తూనే ఉన్నది. సిక్కింను భారత్ నుంచి విభజించి.. స్వతంత్ర దేశాన్ని చేయాలంటూ చైనా అధికారిక మీడియా తాజాగా పిలుపునిచ్చింది. చైనా సరిహద్దుల్లో ఉన్న సిక్కిం రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమానికి చైనీస్ పౌరులు ఆజ్యం పోయాలంటూ నేరుగా భారత రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టాలనేరీతిలో వ్యాఖ్యలు చేసింది.
సిక్కింను భారత్ క్రూరంగా తన దేశంలో కలుపుకున్నదని, సిక్కింపై చైనా తన వైఖరిని మార్చుకొని.. ఇప్పుడు స్వాతంత్ర్య సిక్కిం డిమాండ్‌కు అండగా నిలువాలని సూచించింది. ’సిక్కిం విషయంలో చైనా తన వైఖరిని పునరాలోచించాలి. 2003లో సిక్కిం భారత్‌లో కలుపుకోవడాన్ని చైనా గుర్తించినప్పటికీ.. ఇప్పుడు ఆ వైఖరిని మార్చుకోవచ్చు’ అంటూ అధికారిక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ ఒక సంపాదకీయాన్ని వండివార్చింది. సిక్కిం సెక్టార్‌లోని డొకాలం ప్రాంతంలో భారత బలగాలు వెనుకకు తగ్గాలని, లేదంటే సిక్కింపై చైనా వైఖరి మారుతుందనే సంకేతాలను ఈ సంపాదకీయంలో ఇచ్చింది.
‘గతంలో దలైలామా కార్డును భారత్ వాడుతుందేమోనని చైనా ఆందోళన చెందేది. కానీ, ఈ కార్డు ఇప్పుడు పనిచేయదు. టిబేట్ విషయంలో దీని ప్రభావం ఏమీ లేదు. కాబట్టి భారత్‌కు సంబంధించిన సున్నితమైన అంశాలలో చైనా తన వైఖరి మార్చుకోవాలి. ఇది భారత్‌ను ఎదుర్కోవడానికి ఒక శక్తివంతమైన కార్డుగా పనిచేస్తుంది’ అని రాసుకొచ్చింది. భూటాన్ విషయంలో భారత్ జోక్యాన్ని తగ్గించాలని, భూటాన్ దౌత్య, రక్షణ సార్వభౌమాత్వాన్ని కాపాడాలంటూ రాసుకొచ్చింది.