bore excavation
-
బీడు భూములకు జలకళ
సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): వైఎస్సార్ జలకళ పథకం అమలుతో రాష్ట్రంలోని బీడు, మెట్ట భూముల్లో జల సిరులు వెల్లివిరుస్తున్నాయి. 2020 సెప్టెంబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. 6 నెలల వ్యవధిలోనే కొత్తగా 20 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కలిగింది. ఇప్పటివరకు 4,223 వ్యవసాయ బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నెల రోజుల క్రితం వరకు గ్రామాల్లో వ్యవసాయ భూముల్లో ఏదో ఒక పంట ఉండటంతో పనులు కాస్త మందకొడిగా సాగినా.. ఇప్పుడు నిత్యం 50 నుంచి 70 వరకు బోర్ల తవ్వకాలు కొనసాగుతున్నాయి. రానున్న రోజుల్లో వీటి తవ్వకాల్లో మరింత వేగం పుంజుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులకు భారం లేకుండా.. వైఎస్సార్ జలకళ పథకం అమల్లోకి రాకముందు బోర్లు వేయించుకుని, విద్యుత్ కనెక్షన్ తీసుకొని, మోటారు బిగించుకోవడం అనేది చిన్న, సన్నకారు రైతులకు తలకు మించిన భారంగా ఉండేది. బోరు వేసినా నీళ్లు పడకపోతే.. ఇంకో బోరు వేయడం.. అదీ ఫలించకపోతే మరో బోరు వేయడం వల్ల వేలాది మంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైఎస్సార్ జలకళ పథకం అమల్లోకి వచ్చాక అలాంటి ఇబ్బందులకు, నష్టాలకు చెక్ పడింది. బోరు తవ్వకంతో పాటు పంపుసెట్ ఏర్పాటు వంటివి కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. తవ్వకం పూర్తయిన చోట విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం, మోటార్లు బిగించడంపై గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. 82 నియోజకవర్గాల్లో వేగంగా.. ప్రాజెక్టుల ద్వారా సాగునీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పథకానికి రైతుల నుంచి విశేష స్పందన వస్తోంది. 82 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పదికి మించి బోర్ల తవ్వకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో 253 బోర్ల తవ్వకాలు పూర్తవగా.. కర్నూలు జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గాల్లో 200 చొప్పున బోర్ల తవ్వకాలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1,191 బోర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. నాలుగేళ్లలో రెండు లక్షల బోర్లు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రెండు లక్షల వ్యవసాయ బోర్ల తవ్వకం లక్ష్యంగా నిర్ణయించారు. వీఆర్వో స్థాయిలోనే 93,812 దరఖాస్తుల పరిశీలనను పూర్తి చేసి.. వాటిని ఆమోదించారు. వాటిలో జియాలజిస్ట్ సర్వే పూర్తయిన 7,892 బోర్ల తవ్వకానికి ఇప్పటికే అన్నిరకాల అనుమతులు మంజూరయ్యాయి. వాల్టా చట్టానికి మార్పులు వాల్టా చట్టం నిబంధనల కారణంగా ఈ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు తవ్వకానికి ఆటంకాలు ఎదురు కావడంతో నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగా వాల్టా చట్టాన్ని సవరించేందుకు చర్యలు చేపట్టాం. ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో బోర్ల తవ్వకానికి చర్యలు చేపట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. బోరు తవ్వకానికి ముందే లబ్ధిదారుని భూమిని జియాలజిస్ట్ ద్వారా సర్వే చేయించిన అనంతరమే తవ్వకం ప్రారంభిస్తుండటంతో 81 శాతం బోరు తవ్వకాలు సక్సెస్ అవుతున్నట్టు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు అందుతున్నాయి. – గిరిజా శంకర్, కమిషనర్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వైఎస్సార్ జలకళ ఆనందం నింపింది మాకు 4.50 ఎకరాల మెట్ట భూమి ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుండక బోరు వేయించలేకపోయాను. మా కోరికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీర్చారు. ఎలాంటి రికమండేషన్లు లేకుండానే గత నెలలో బోరు వేశారు. నీరు సమృద్ధిగా పడింది. వైఎస్సార్ జలకళ మా కుటుంబంలో ఆనందాన్ని నింపింది. – కె.లక్ష్మయ్య, ఇందిరేశ్వరం, ఆత్మకూరు మండలం, కర్నూలు జిల్లా -
పాతాళగంగ పొలం తడవంగ..
సాక్షి, అమరావతి: అప్పులు చేసి రైతులు బోర్లు వేయాల్సిన పని ఇకలేదు. బోర్లలో నీళ్లు పడకపోతే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇకరాదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుర్గతి ఇక ఉండదు. రైతుల జేబుల్లోంచి పైసా పెట్టుబడి పెట్టే అవసరం లేకుండానే.. బోరు వేస్తే నీళ్లు పడతాయా లేదా అన్న సంశయం తలెత్తకుండానే.. ఆ రైతుల భూముల్లో పాతాళగంగ ఉబికివచ్చి పొంగిపొర్లింది. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల భూముల్లో ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించే కార్యక్రమం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై, తమ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, చిత్తూరులో తొమ్మిది, కర్నూలు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఆయా జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఉచిత బోర్ల తవ్వకం కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదని, ఆ మూడు జిల్లాలతో పాటు తొలిరోజు పథకం ప్రారంభం కాని అన్ని చోట్ల బుధవారం నుంచి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేసే ముందు జియాలజిస్టులతో సర్వే చేయించడం వల్ల బోర్లు వేసిన ప్రతిచోట అవి విజయవంతం అయినట్టు తెలిపారు. రైతురాజ్యాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు: మంత్రి పెద్దిరెడ్డి పొలాల్లో బోర్ల తవ్వకం ఆర్థికంగా రైతులపై భారాన్ని పెంచుతున్నందున ప్రభుత్వమే ఉచితంగా ఆ బోర్లు తవ్వించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రిగ్గును ఏర్పాటు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రలో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారికి అండగా నిలుస్తానని ఆనాడు ఇచ్చిన మాట నేడు సాకారమైందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతు పొలంలో ఉచితంగా బోరుబావిని తవ్విస్తామని, రానున్న నాలుగేళ్లలో మొత్తం 3 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేవలం ఉచిత బోరుబావుల తవ్వకానికే హామీ ఇచ్చినప్పటికీ, చిన్న, సన్నకారు రైతుల ఆరి్థక పరిస్థితి తెలిసి ఉచిత బోరుతో పాటు మోటార్, దానికి అవసరమైన వైర్, ఇతర విద్యుత్ పరికరాలను కూడా ఉచితంగానే అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం ఆయనది రైతుపక్షపాతి పాలన అని చెప్పడానికి నిదర్శనమని అన్నారు. ఇక నుంచి పంటలు సాగు చేసుకుంటా.. పాదయాత్ర సందర్భంగా మా కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే ఆ హామీ అమలుకు ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రాప్తాడు నియోజకవర్గంలోనే తొలి బోరు నా పొలంలో వేయడం అదృష్టంగా భావిస్తున్నా. వంద అడుగుల లోతులోనే రెండున్నర ఇంచుల నీరు పడింది. నాకు 4.50 ఎకరాల పొలం ఉంది. ఇక నుంచి కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేసుకుంటా. – నరసింహుడు, రైతు, కుంటిమద్ది,రామగిరి మండలం, అనంతపురం జిల్లా -
నేటి నుంచి ఉచిత బోరు తవ్వకాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచిత వ్యవసాయ బోర్ల తవ్వకం రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ప్రారంభమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను పట్టణ ప్రాంతంలోని వాటిని మినహాయిస్తే 162 నియోజకవర్గాల పరిధిలోని వ్యవసాయ భూముల్లో బోర్ల తవ్వకం పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయా నియోజకవర్గాల్లో తొలి బోరు తవ్వకం కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాల్గొంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జలకళ పథకం అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో ఉచిత బోరుతో పాటు మోటార్ లేదా పంపుసెట్‌ను కూడా ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు తవ్వడం ద్వారా ఐదు లక్షల ఎకరాలను పూర్తి స్థాయిలో సాగులోకి తీసుకరావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ పథకం ద్వారా సుమారు 3 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బోర్లు తవ్వకానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున రిగ్గులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, వాటర్ షెడ్స్ డైరెక్టర్ వెంకటరెడ్డి సోమవారం జిల్లాల పీడీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని చోట్ల డ్రిల్లింగ్ కార్యక్రమం ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే తొలి బోరు తవ్వకం పనులు మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు. -
పాతాళగంగలో ఫ్లోరైడ్ భూతం!
♦ అడుగంటిన భూగర్భ జలాలు అయినా ఆగని తవ్వకాలు ♦ 300 అడుగులు మించితే ప్రమాదమే.. తేల్చిచెబుతున్న నిపుణులు ♦ జిల్లాలో ఫ్లోరైడ్ జలాల కలకలం ♦ భూగర్భ జలాలు తగ్గినా ఆగని బోరు తవ్వకాలు ♦ సగటున వెయ్యి ఫీట్ల లోతుకు బావులు ♦ 300 అడుగులు మించితే ప్రమాదమంటున్న నిపుణులు ♦ సింగిల్‌ఫేజ్ మోటార్లు కూడా ‘లోతు’కు కారణం భూగర్భ జలాలు అడుగంటాయి.. పాతాళగంగలో ఫ్లోరైడ్ జలాలే దిక్కవుతున్నాయి. ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుండటం.. సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు ఎక్కువకావడంతో ఈ దుస్థితి నెలకొంది. ఫ్లోరైడ్ జలాలే ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. జిల్లాలో వరుసగా కరువు పరిస్థితులు తలెత్తడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయింది. ఈ తరుణంలో బోరుబావులను 600 నుంచి 1000 ఫీట్లకుపైగా తవ్వుతున్నారు. ఫ్లోరైడ్ కలిసిన జలాలు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. నిజానికి 300 ఫీట్ల లోతు కంటే ఎక్కువ వేస్తే వచ్చేది ఫ్లోరైడ్ నీరేనని వారంటున్నారు. ఇది తెలియని ప్రజలు కలుషిత జలాలు తాగుతూ రోగాలకు దగ్గరవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతం మినహా జిల్లా వ్యాప్తంగా ఇదే స్థితి ఉందని చెబుతున్నారు. గజ్వేల్: ఇన్నాళ్లు అమృతం పంచిన పాతాళగంగ.. ప్రస్తుతం విషం చిమ్ముతోంది. కరువు ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుండటంతో ఈ దుస్థితి ఎదురవుతోంది. జిల్లాలో సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు ఎక్కువకావడంతో తవ్వకాలు వెయ్యి అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో ఫ్లోరైడ్ జలాలే ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం మినహా మిగిలిన చోట్ల ఈ ముప్పు ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. తెరపైకి ‘సింగిల్‌ఫేజ్’ వ్యవస్థ జిల్లాలో 1066 గ్రామ పంచాయతీలు.. రెండు వేలకు పైగా మదిర గ్రామాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి 80 లీటర్ల చొప్పున తక్కువలో తక్కువగా 28 కోట్ల లీటర్లకు పైగా నీటిని అందించాల్సి ఉంది. ఈ బా ద్యత ఆర్డబ్ల్యూఎస్(గ్రామీణ నీటి సరఫరా విభాగం)కు పెద్ద సవాల్‌గా మారింది. ఈక్రమంలో కొన్నేళ్ల క్రితం సింగిల్‌ఫేజ్ బోరుమోటార్ల వ్యవస్థ వ చ్చింది. గతంలో త్రీఫేజ్ వి ద్యుత్ సరఫరా ఉన్నప్పుడే మంచినీటి బోరుబావులు నడిచేవి. అలాకాకుండా సింగిల్‌ఫేజ్ విధానంలో 1 హెచ్‌పీ(హార్స్పవర్) మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో సింగిల్‌ఫేజ్ విద్యుత్ సరఫరా ఉన్నంత సేపు మోటార్లు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలో 17,500 బోరుబావులుండగా ఇందులో 10 వేల వరకు సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఉండటం విశేషం. పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా ప్రస్తుతం 17,500 బోరుబావులు నడుస్తుం డగా వీటి విద్యుత్ బిల్లులు రూ. 156 కోట్లకుపైగా పేరుకుపోయాయి. ప్రస్తుతం పంచాయతీల కు సంబంధించి రూ.134 కోట్లు, మున్సిపాలలిటీల కు సంబంధించి రూ.22 కోట్ల బకాయిలున్నాయి. రెండేళ్ల నుంచి బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. నిజానికి 12వ ఆర్థిక సంఘం నిధుల నుం చి సర్పంచ్‌లు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా చేతులెత్తేశారు. ఈనేపథ్యంలో మరికొన్ని రోజులు చూసి సరఫరా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు విద్యుత్ శాఖ ఎస్ఈ సదాశివరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. అయి తే, మార్చి ఆఖరు వరకు బిల్లులు చెల్లిస్తామని స ర్పంచ్‌లు జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు. నల్లా కనెక్షన్ ఎరుగని గ్రామం జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామ ప ంచాయితీ మదిర గ్రామం గోపాల్పూర్. గ్రామం లో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. 250 జ నాభా, 170 ఓటర్లు ఉన్నారు. మూడు సింగిల్‌ఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి. ఒక బోరుబావి పూ ర్తిగా ఎండిపోగా మరోటి మోటారు లేక నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఒక్క బోరే దిక్కు అయ్యింది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు మినీ ట్యాంకుల్లో ఒకదానికి కనెక్షన్ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ లే కపొవడంతో ట్యాంక్ నుంచి ఇళ్లకు పైప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ట్యాంకుకు 20కి పైగా పైపులు ఉన్నాయి. దీంతో అప్పడప్పుడు గ్రామస్తుల మధ్య నీళ్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో రెండు చేతి పంపులున్నా అవీ పని చేయడం లేదు. ఎండకాలం వస్తే నీళ్ల కోసం పొలాల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇంత వరకు నల్లా కనెక్షన్ ఎరుగమని చెప్పారు. ‘వాటర్‌గ్రిడ్’ వస్తే ఉపశమనం కరెంట్ ఉన్నప్పుడల్లా నీటిని పట్టుకొని అవసరాలు తీర్చుకుంటున్న జనంలో ఫ్లోరైడ్ భయం అలుముకుంది. ఇప్పటికే ఈ భయంతో చాలామంది మినరల్ వాటర్ వినియోగిస్తున్నారు. గ్రా మాల్లో రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది ‘సింగిల్ ఫేజ్’ నీటినే తాగుతున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌గ్రిడ్’ పథకం ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోంది. మండలాల్లో పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గం: నియోజకవర్గంలో 128 గ్రామపంచాయతీలు, ఒక నగర పంచాయతీ ఉంది. గజ్వేల్ మండలంలో 22 గ్రామపంచాయతీలు, 27 హాబిటేషన్లు, నగర పం చాయతీ ఉంది. మండలంలో సుమారు 84 వేలకు పైగా జనాభా ఉండగా మండలంలో ప్రస్తుతం 60 వరకు ఓవర్‌హెడ్ ట్యాంకులున్నాయి. త్రీఫేజ్ బో రుమోటార్లు కేవలం 60 మాత్రమే ఉండగా సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు 300లకుపైగా ఉన్నాయి. జగదేవ్‌పూర్ మండలం: 23 పంచాయతీలు, 40 హాబిటేషన్లు కలిపి 48 వేలకుపైగా జనాభా ఉన్నారు. మొత్తం 56 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉండగా 105 త్రీఫేజ్ బోరుమోటార్లు ఉన్నాయి. సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఏకంగా 308కి పైగా ఉన్నాయి. కొండపాక మండలం: 18 పంచాయతీలు, 42 హాబిటేషన్లు కలిపి 50 వేల జనాభా ఉండగా 52 ఓవర్‌హెడ్ ట్యాంకులున్నా యి. త్రీఫేజ్ బోరుమోటార్లు 102 ఉండగా, సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు 245కు పైగా ఉన్నాయి. ములుగు మండలం: 25 పంచాయతీలు, 42 హాబిటేషన్లు కలిపి 45 వేలకుపైగా జనాభా ఉన్నారు. 40 ఓవర్‌హెడ్ ట్యాంకులుండగా 88 త్రీఫేజ్ బోరుమోటార్లు, 156 సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లున్నాయి. తూప్రాన్ మండలం: 22 పంచాయతీలు, 49 హాబిటేషన్లు కలిపి 62 వేలకుపైగా జనాభా ఉండగా 48 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 116 త్రీఫేజ్ మోటార్లు, 190 సింగిల్‌ఫేజ్ మోటార్లున్నాయి. వర్గల్ మండలం: 18 పంచాయతీలు, 46 హాబిటేషన్లు కలిపి జనాభా 44 వేల వరకు ఉన్నారు. 44 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 102 త్రీఫేజ్ మోటార్లు, 215కు పైగా సింగిల్‌ఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి. ఆ నీటితో ఫ్లోరైడ్ ముప్పు భూగర్భజలమట్టం పూర్తిగా పడిపోవడం వల్ల వెయ్యి ఫీట్ల లోతుకు బోరుబావులు తవ్వుతున్నారు. ఈ నీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది. వీటిని శుద్ధి చేసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అలా చేయకపోతే ఇబ్బంది తప్పదు. ప్రభుత్వం చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్’ పథకం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. రిజర్వాయర్లలో నీటిని శుద్ధి చేసి అందిస్తాం కాబట్టి ఇక వ్యాధులు ఇబ్బంది ఉండదు. - విజయప్రకాశ్, ఎస్ఈ, మెదక్ జిల్లా వాటర్‌గ్రిడ్ సింగిల్ ఫేజ్ బోరే దిక్కు మా ఊల్లే ఇప్పటిదాక నల్లా కనెక్షన్ అంటే తెలియదు. సింగల్ ఫేజ్ మోటార్ల మీద ఆధారపడ్డం. దాని దగ్గర నుంచి పైపులైన్లు వేసుకున్నం. ఉదయం వరుస బట్టి నీళ్లు పట్టుకుంటం.ఎండకాలం వస్తే నీళ్లకు చాలా ఇబ్బం దులు అయితున్నయ్. మాది చిన్న గ్రామమని ఎవరు పట్టించుకుంట లేరు. - బొగ్గుల లక్ష్మి, గోపాల్పూర్, జగదేవ్‌పూర్ మండలం బోరుకు పైపులు ఏసుకుంటం కాలం ఎన్కకు పట్టింది. బోర్లు మర్లబడుతున్నయ్. శాన బోర్లల్ల నీళ్లు తగ్గినయ్. తాగు నీళ్ల కోసం పది మంది కలిసి సొం తంగా బోరేసుకున్నం. ఆ బోర్ల నీళ్లు పూర్తిగా లేకుండపోయినయ్. బడి దగ్గర స ర్కార్ బోరుకు పైపులు తలిగించి ఇండ్లల్లకు నీళ్లు తెచ్చుకుంటున్నం. - అండమ్మ, ఇప్పలగూడ, వర్గల్ మండలం