ఉచిత బోరు వేస్తున్న దశ్యం, వైఎస్సార్ జలకళ పథకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అధికారులు
సాక్షి, అమరావతి: అప్పులు చేసి రైతులు బోర్లు వేయాల్సిన పని ఇకలేదు. బోర్లలో నీళ్లు పడకపోతే కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇకరాదు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుర్గతి ఇక ఉండదు. రైతుల జేబుల్లోంచి పైసా పెట్టుబడి పెట్టే అవసరం లేకుండానే.. బోరు వేస్తే నీళ్లు పడతాయా లేదా అన్న సంశయం తలెత్తకుండానే.. ఆ రైతుల భూముల్లో పాతాళగంగ ఉబికివచ్చి పొంగిపొర్లింది. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల భూముల్లో ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వించే కార్యక్రమం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరై, తమ నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అనంతపురం జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, చిత్తూరులో తొమ్మిది, కర్నూలు జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున ఆయా జిల్లాల్లో అత్యధిక నియోజకవర్గాల్లో ఉచిత బోర్ల తవ్వకం కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదని, ఆ మూడు జిల్లాలతో పాటు తొలిరోజు పథకం ప్రారంభం కాని అన్ని చోట్ల బుధవారం నుంచి పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జలకళ పథకం ద్వారా రైతుల పొలాల్లో బోర్లు వేసే ముందు జియాలజిస్టులతో సర్వే చేయించడం వల్ల బోర్లు వేసిన ప్రతిచోట అవి విజయవంతం అయినట్టు తెలిపారు.
రైతురాజ్యాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు: మంత్రి పెద్దిరెడ్డి
పొలాల్లో బోర్ల తవ్వకం ఆర్థికంగా రైతులపై భారాన్ని పెంచుతున్నందున ప్రభుత్వమే ఉచితంగా ఆ బోర్లు తవ్వించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున రిగ్గును ఏర్పాటు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రజాసంకల్ప యాత్రలో రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారికి అండగా నిలుస్తానని ఆనాడు ఇచ్చిన మాట నేడు సాకారమైందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతు పొలంలో ఉచితంగా బోరుబావిని తవ్విస్తామని, రానున్న నాలుగేళ్లలో మొత్తం 3 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కేవలం ఉచిత బోరుబావుల తవ్వకానికే హామీ ఇచ్చినప్పటికీ, చిన్న, సన్నకారు రైతుల ఆరి్థక పరిస్థితి తెలిసి ఉచిత బోరుతో పాటు మోటార్, దానికి అవసరమైన వైర్, ఇతర విద్యుత్ పరికరాలను కూడా ఉచితంగానే అందిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం ఆయనది రైతుపక్షపాతి పాలన అని చెప్పడానికి నిదర్శనమని అన్నారు.
ఇక నుంచి పంటలు సాగు చేసుకుంటా..
పాదయాత్ర సందర్భంగా మా కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కాగానే ఆ హామీ అమలుకు ‘వైఎస్సార్ జలకళ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రాప్తాడు నియోజకవర్గంలోనే తొలి బోరు నా పొలంలో వేయడం అదృష్టంగా భావిస్తున్నా. వంద అడుగుల లోతులోనే రెండున్నర ఇంచుల నీరు పడింది. నాకు 4.50 ఎకరాల పొలం ఉంది. ఇక నుంచి కంది, వేరుశనగ తదితర పంటలు సాగు చేసుకుంటా.
– నరసింహుడు, రైతు, కుంటిమద్ది,రామగిరి మండలం, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment