పాతాళగంగలో ఫ్లోరైడ్ భూతం!
♦ అడుగంటిన భూగర్భ జలాలు అయినా ఆగని తవ్వకాలు
♦ 300 అడుగులు మించితే ప్రమాదమే.. తేల్చిచెబుతున్న నిపుణులు
♦ జిల్లాలో ఫ్లోరైడ్ జలాల కలకలం
♦ భూగర్భ జలాలు తగ్గినా ఆగని బోరు తవ్వకాలు
♦ సగటున వెయ్యి ఫీట్ల లోతుకు బావులు
♦ 300 అడుగులు మించితే ప్రమాదమంటున్న నిపుణులు
♦ సింగిల్‌ఫేజ్ మోటార్లు కూడా ‘లోతు’కు కారణం
భూగర్భ జలాలు అడుగంటాయి.. పాతాళగంగలో ఫ్లోరైడ్ జలాలే దిక్కవుతున్నాయి. ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుండటం.. సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు ఎక్కువకావడంతో ఈ దుస్థితి నెలకొంది. ఫ్లోరైడ్ జలాలే ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్తు ఆందోళనకరంగా మారుతోంది. జిల్లాలో వరుసగా కరువు పరిస్థితులు తలెత్తడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పడిపోయింది. ఈ తరుణంలో బోరుబావులను 600 నుంచి 1000 ఫీట్లకుపైగా తవ్వుతున్నారు. ఫ్లోరైడ్ కలిసిన జలాలు వస్తున్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. నిజానికి 300 ఫీట్ల లోతు కంటే ఎక్కువ వేస్తే వచ్చేది ఫ్లోరైడ్ నీరేనని వారంటున్నారు. ఇది తెలియని ప్రజలు కలుషిత జలాలు తాగుతూ రోగాలకు దగ్గరవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. మంజీర పరీవాహక ప్రాంతం మినహా జిల్లా వ్యాప్తంగా ఇదే స్థితి ఉందని చెబుతున్నారు.
గజ్వేల్: ఇన్నాళ్లు అమృతం పంచిన పాతాళగంగ.. ప్రస్తుతం విషం చిమ్ముతోంది. కరువు ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పాటు ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తుండటంతో ఈ దుస్థితి ఎదురవుతోంది. జిల్లాలో సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు ఎక్కువకావడంతో తవ్వకాలు వెయ్యి అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. దీంతో ఫ్లోరైడ్ జలాలే ప్రజల దాహార్తిని తీర్చుతున్నాయి. మంజీర పరివాహక ప్రాంతం మినహా మిగిలిన చోట్ల ఈ ముప్పు ఎక్కువగా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
తెరపైకి ‘సింగిల్‌ఫేజ్’ వ్యవస్థ
జిల్లాలో 1066 గ్రామ పంచాయతీలు.. రెండు వేలకు పైగా మదిర గ్రామాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 లక్షల జనాభా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక్కొక్కరికి 80 లీటర్ల చొప్పున తక్కువలో తక్కువగా 28 కోట్ల లీటర్లకు పైగా నీటిని అందించాల్సి ఉంది. ఈ బా ద్యత ఆర్‌డబ్ల్యూఎస్(గ్రామీణ నీటి సరఫరా విభాగం)కు పెద్ద సవాల్‌గా మారింది. ఈక్రమంలో కొన్నేళ్ల క్రితం సింగిల్‌ఫేజ్ బోరుమోటార్ల వ్యవస్థ వ చ్చింది. గతంలో త్రీఫేజ్ వి ద్యుత్ సరఫరా ఉన్నప్పుడే మంచినీటి బోరుబావులు నడిచేవి. అలాకాకుండా సింగిల్‌ఫేజ్ విధానంలో 1 హెచ్‌పీ(హార్స్‌పవర్) మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో సింగిల్‌ఫేజ్ విద్యుత్ సరఫరా ఉన్నంత సేపు మోటార్లు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలో 17,500 బోరుబావులుండగా ఇందులో 10 వేల వరకు సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఉండటం విశేషం.
పేరుకుపోయిన విద్యుత్ బకాయిలు
జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ద్వారా ప్రస్తుతం 17,500 బోరుబావులు నడుస్తుం డగా వీటి విద్యుత్ బిల్లులు రూ. 156 కోట్లకుపైగా పేరుకుపోయాయి. ప్రస్తుతం పంచాయతీల కు సంబంధించి రూ.134 కోట్లు, మున్సిపాలలిటీల కు సంబంధించి రూ.22 కోట్ల బకాయిలున్నాయి. రెండేళ్ల నుంచి బిల్లులు చెల్లించడం లేదని తెలుస్తోంది. నిజానికి 12వ ఆర్థిక సంఘం నిధుల నుం చి సర్పంచ్‌లు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా చేతులెత్తేశారు. ఈనేపథ్యంలో మరికొన్ని రోజులు చూసి సరఫరా నిలిపివేసే యోచనలో ఉన్నట్టు విద్యుత్ శాఖ ఎస్‌ఈ సదాశివరెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. అయి తే, మార్చి ఆఖరు వరకు బిల్లులు చెల్లిస్తామని స ర్పంచ్‌లు జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు.
నల్లా కనెక్షన్ ఎరుగని గ్రామం
జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామ ప ంచాయితీ మదిర గ్రామం గోపాల్‌పూర్. గ్రామం లో మొత్తం 40 కుటుంబాలు ఉన్నాయి. 250 జ నాభా, 170 ఓటర్లు ఉన్నారు. మూడు సింగిల్‌ఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి. ఒక బోరుబావి పూ ర్తిగా ఎండిపోగా మరోటి మోటారు లేక నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఒక్క బోరే దిక్కు అయ్యింది. 15 ఏళ్ల క్రితం నిర్మించిన రెండు మినీ ట్యాంకుల్లో ఒకదానికి కనెక్షన్ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. ఇంటింటికీ నల్లా కనెక్షన్ లే కపొవడంతో ట్యాంక్ నుంచి ఇళ్లకు పైప్‌లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక ట్యాంకుకు 20కి పైగా పైపులు ఉన్నాయి. దీంతో అప్పడప్పుడు గ్రామస్తుల మధ్య నీళ్ల కోసం గొడవలు జరుగుతున్నాయి. గ్రామంలో రెండు చేతి పంపులున్నా అవీ పని చేయడం లేదు. ఎండకాలం వస్తే నీళ్ల కోసం పొలాల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇంత వరకు నల్లా కనెక్షన్ ఎరుగమని చెప్పారు.
‘వాటర్‌గ్రిడ్’ వస్తే ఉపశమనం
కరెంట్ ఉన్నప్పుడల్లా నీటిని పట్టుకొని అవసరాలు తీర్చుకుంటున్న జనంలో ఫ్లోరైడ్ భయం అలుముకుంది. ఇప్పటికే ఈ భయంతో చాలామంది మినరల్ వాటర్ వినియోగిస్తున్నారు. గ్రా మాల్లో రూ.10 నుంచి రూ.15 వరకు విక్రయిస్తుండటంతో ఎక్కువ మంది ‘సింగిల్ ఫేజ్’ నీటినే తాగుతున్నారు. దీంతో వ్యాధుల బారిన పడుతున్నారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వాటర్‌గ్రిడ్’ పథకం ప్రజల్లో కొత్త ఆశలను నింపుతోంది.
మండలాల్లో పరిస్థితి
గజ్వేల్ నియోజకవర్గం: నియోజకవర్గంలో 128 గ్రామపంచాయతీలు, ఒక నగర పంచాయతీ ఉంది. గజ్వేల్ మండలంలో 22 గ్రామపంచాయతీలు, 27 హాబిటేషన్లు, నగర పం చాయతీ ఉంది. మండలంలో సుమారు 84 వేలకు పైగా జనాభా ఉండగా మండలంలో ప్రస్తుతం 60 వరకు ఓవర్‌హెడ్ ట్యాంకులున్నాయి. త్రీఫేజ్ బో రుమోటార్లు కేవలం 60 మాత్రమే ఉండగా సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు 300లకుపైగా ఉన్నాయి.
జగదేవ్‌పూర్ మండలం: 23 పంచాయతీలు, 40 హాబిటేషన్లు కలిపి 48 వేలకుపైగా జనాభా ఉన్నారు. మొత్తం 56 ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉండగా 105 త్రీఫేజ్ బోరుమోటార్లు ఉన్నాయి. సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు ఏకంగా 308కి పైగా ఉన్నాయి.
కొండపాక మండలం: 18 పంచాయతీలు, 42 హాబిటేషన్లు కలిపి 50 వేల జనాభా ఉండగా 52 ఓవర్‌హెడ్ ట్యాంకులున్నా యి. త్రీఫేజ్ బోరుమోటార్లు 102 ఉండగా, సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లు 245కు పైగా ఉన్నాయి.
ములుగు మండలం: 25 పంచాయతీలు, 42 హాబిటేషన్లు కలిపి 45 వేలకుపైగా జనాభా ఉన్నారు. 40 ఓవర్‌హెడ్ ట్యాంకులుండగా 88 త్రీఫేజ్ బోరుమోటార్లు, 156 సింగిల్‌ఫేజ్ బోరుమోటార్లున్నాయి.
తూప్రాన్ మండలం: 22 పంచాయతీలు, 49 హాబిటేషన్లు కలిపి 62 వేలకుపైగా జనాభా ఉండగా 48 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 116 త్రీఫేజ్ మోటార్లు, 190 సింగిల్‌ఫేజ్ మోటార్లున్నాయి.
వర్గల్ మండలం: 18 పంచాయతీలు, 46 హాబిటేషన్లు కలిపి జనాభా 44 వేల వరకు ఉన్నారు. 44 ఓవర్‌హెడ్ ట్యాంకులు, 102 త్రీఫేజ్ మోటార్లు, 215కు పైగా సింగిల్‌ఫేజ్ బోరు మోటార్లు ఉన్నాయి.
ఆ నీటితో ఫ్లోరైడ్ ముప్పు
భూగర్భజలమట్టం పూర్తిగా పడిపోవడం వల్ల వెయ్యి ఫీట్ల లోతుకు బోరుబావులు తవ్వుతున్నారు. ఈ నీటిలో ఫ్లోరైడ్ ఉంటుంది. వీటిని శుద్ధి చేసుకుంటే వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. అలా చేయకపోతే ఇబ్బంది తప్పదు. ప్రభుత్వం చేపడుతున్న ‘వాటర్‌గ్రిడ్’ పథకం ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుంది. రిజర్వాయర్లలో నీటిని శుద్ధి చేసి అందిస్తాం కాబట్టి ఇక వ్యాధులు ఇబ్బంది ఉండదు.
- విజయప్రకాశ్, ఎస్‌ఈ, మెదక్ జిల్లా వాటర్‌గ్రిడ్
సింగిల్ ఫేజ్ బోరే దిక్కు
మా ఊల్లే ఇప్పటిదాక నల్లా కనెక్షన్ అంటే తెలియదు. సింగల్ ఫేజ్ మోటార్ల మీద ఆధారపడ్డం. దాని దగ్గర నుంచి పైపులైన్లు వేసుకున్నం. ఉదయం వరుస బట్టి నీళ్లు పట్టుకుంటం.ఎండకాలం వస్తే నీళ్లకు చాలా ఇబ్బం దులు అయితున్నయ్. మాది చిన్న గ్రామమని ఎవరు పట్టించుకుంట లేరు. - బొగ్గుల లక్ష్మి, గోపాల్‌పూర్, జగదేవ్‌పూర్ మండలం
బోరుకు పైపులు ఏసుకుంటం
కాలం ఎన్కకు పట్టింది. బోర్లు మర్లబడుతున్నయ్. శాన బోర్లల్ల నీళ్లు తగ్గినయ్. తాగు నీళ్ల కోసం పది మంది కలిసి సొం తంగా బోరేసుకున్నం. ఆ బోర్ల నీళ్లు పూర్తిగా లేకుండపోయినయ్. బడి దగ్గర స ర్కార్ బోరుకు పైపులు తలిగించి ఇండ్లల్లకు నీళ్లు తెచ్చుకుంటున్నం. - అండమ్మ, ఇప్పలగూడ, వర్గల్ మండలం