9 అడుగుల్లో బోరు.. కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు | Sakshi
Sakshi News home page

9 అడుగుల్లో బోరు.. కరెంటు లేకున్నా 20 ఏళ్లుగా నీరు

Published Thu, Apr 4 2024 4:30 AM

Water for 20 years without electricity - Sakshi

ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ రైతు చేనులో ఆగని జలధార..

2005లో వేసిన బోరు.. మండే ఎండల్లోనూ నిరంతరాయంగా ప్రవాహం  

సాక్షి, ఆదిలాబాద్‌: మండుతున్న ఎండలతో రాష్ట్రంలో నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. చెరువులు ఎండిపోతున్నాయి. పంటలకు నీరందక చేలలో బీటలు కనిపిస్తున్నాయి. మరో వైపు తాగునీటి సమస్య కూడా జఠిలమవుతోంది. భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి.

అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం దుబ్బగూడ (ఎస్‌)లోని ఓ గిరిజన రైతు పంట చేనులో మాత్రం బోరు నుంచి జలం ఉబికి వస్తూనే ఉంది. విచిత్రం ఏమిటంటే అసలు ఈ బోరుకు కరెంటు కనెక్షనే లేదు. దాదాపు 20 ఏళ్లుగా సహజంగా నీళ్లు ఇలా వస్తూనే ఉన్నాయి. 

2005 నుంచి కొనసాగుతున్న ధార.. 
గిరిజన రైతు టేకం తుకారాంకు 26 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆయన ముగ్గురు కుమారులతో కలిసి దీన్ని సాగుచేస్తున్నాడు. 2005లో తుకారాం చేనులో బోరు వేయించాడు. అప్పుడు 9 అడుగులకే నీళ్లు ఉబికి వచ్చాయి. కరెంటు కనెక్షన్‌ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ జలధార ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 13 ఎకరాల్లో జొన్న, గోధుమ పంటలు పండిస్తున్నాడు. వీటికి నిరంతరాయంగా బోరు నుంచి వచ్చే నీరే అందిస్తున్నాడు. ఆర్టీసియన్‌ బావి కారణంగానే.. 
దీన్ని భూగర్భ జలశాస్త్రం ప్రకారం ఆర్టిసియన్‌ బావి అంటారు. దుబ్బగూడ (ఎస్‌)కు సమీపంలో గుట్ట ఉంది.

వర్షం కురిసినప్పుడు ఆ గుట్ట ప్రాంతంలో జలం రీచార్జ్‌ అవుతుంది. అక్కడి నుంచి నిలువుగా ఉన్నటువంటి పొర దిగువన గుట్ట దిగిన తర్వాత తుకారాం చేనులో నుంచి వెళ్తుంది. పైపొర గుట్ట పైభాగం నుంచి మొదలు కాగా చివరి పొర తుకారాం చేనును దాటి వెళ్తోంది. దుబ్బగూడలో ఒక లేయర్‌లో భూగర్భ జలాలు పైవరకు ఉంటాయి. మధ్య ప్రాంతంలో ఎవరైనా బోరు వేసినప్పుడు ఈ పొరను తాకడంతో నీళ్లు ఉబికి వస్తున్నాయి.

ఒక ట్యూబ్‌కు మధ్యలో ఎక్కడైనా పంచర్‌ పడ్డప్పుడు గాలి, నీరు ప్రెషర్‌తో బయటకు వచ్చినట్లే ఇక్కడ కూడా పైపొర, చివరి పొర మధ్యన బోరువేసినప్పుడు నీటికి బయటకు వెళ్లే మార్గం ఏర్పడింది. గుట్టకు సమీపంలో ఉండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం బోరింగ్‌గూడలో కూడా ఇలాగే నీళ్లు ఉబికి వస్తాయి.     –టి. పుల్లారావు,అసిస్టెంట్‌ హైడ్రో జియాలజిస్ట్, ఆదిలాబాద్‌  

Advertisement
 
Advertisement
 
Advertisement