రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తాగునీటి సమస్య
వేసవికాలం మొదలైంది. కొన్నిరోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, బావులు కూడా బోసిపోతుయి. దీనితో గ్రామాల్లో నీటికి కటకట మొదలైంది. ఎండాకాలం ప్రారంభంలోనే నల్లాల ద్వారా మంచినీటి సరఫరా తగ్గిపోయింది. ఊర్లలో నీటి ట్యాంకర్ల హడావుడి మొదలైంది.
గ్రామాల్లో పంచాయతీలు, వార్డుల వారీగా ట్యాంకర్లతో నీటి సరఫరా జరుగుతోంది. పట్టణాల్లో అయితే ప్రైవేటు ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకుని వాడుకోవాల్సిన దుస్థితి మొదలైంది. మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గ్రామాల్లో అయితే పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. కిలోమీటర్ల కొద్దీ నడిచి వాగుల వద్దకు వెళ్లి చెలిమల నుంచి నీటిని మోసుకురావాల్సి వస్తోంది.
మైదాన ప్రాంత గ్రామాల్లోనూ పలుచోట్ల నీటికి ఎద్దడి ఏర్పడటంతో శివార్లలోని వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే రెండు నెలల పాటు ఎలా వెళ్లదీయాల్సి వస్తుందోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. – సాక్షి నెట్‌వర్క్
మా‘నీరు’ తగ్గుతోంది
కరీంనగర్‌తోపాటు వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రాంతాలకు ఆధారమైన లోయర్ మానే ర్ డ్యామ్‌లో నీటి నిల్వల పరిస్థితి ఇది. ఈ డ్యామ్ నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలైతే.. ప్రస్తుతం 7.4 టీఎంసీలే ఉన్నాయి. ఎండలు మండుతుండటంతో ఈ నీళ్లు ఎన్ని రోజులకు సరిపోతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దాహం కోసం.. దారి పట్టారు
గిరిజన గ్రామాల్లో తడారిపోతున్న గొంతులకు గుక్కెడు నీళ్లు దొరకాలంటే దూరాలకు వెళ్లక తప్పని దుస్థితిని చూపే చిత్రమిది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సోలంగూడకు చెందిన గిరిజనులు ఇలా వ్యవసాయ పొలాల నుంచి డబ్బాలలో నీళ్లు తెచ్చుకుంటూ కాలం గడుపుతున్నారు.
ట్యాంకర్ వస్తేనే దాహం తీరేది..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గం తాటిపర్తిలో గ్రామపంచాయతీ ట్యాంకర్ వద్ద నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు. దాదాపు నెల రోజులుగా నల్లా నీటి సరఫరా నిలిచిపోయిందని, ట్యాంకర్ నీళ్లే దిక్కు అవుతున్నాయని వారు వాపోతున్నారు.
కిలోమీటర్ల కొద్దీ నడిస్తేనే గొంతు తడిచేది నిర్మల్ జిల్లా పెంబి మండలం ధూమ్‌ధరి గ్రామపంచాయతీ పరిధిలోని చికమున్ వాగులో చెలిమ తోడుకుని నీళ్లు నింపుకొంటున్న గిరిజనులు వీరు. దీనికి ఇరువైపులా ఉన్న వస్పల్లి కొత్తగూడెం, గిరిజనగూడెం రెండు గ్రామాలవారికి ఈ వాగు చెలిమలలోని నీరే దిక్కు. బిందెల్లో నీళ్లు నింపుకొని కిలోమీటర్ల కొద్దీ మోసుకుంటూ వెళ్తేనే.. ఇంటిల్లిపాదీ గుక్కెడు నీళ్లు తాగే పరిస్థితి.
ఊరంతటికీ చెలిమ నీరే ఆధారం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బచ్చువారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల గుంపులో చెలిమ నీటిని తోడుకుంటున్న ఆదివాసీలు వీరు. జనవరిలోనే వాగులు ఎండిపోవడంతో చెలిమలో నీటి ఊట కూడా తక్కువగా ఉంటోందని, ఈసారి నీటి కష్టాలు ఎలా ఉంటాయోనని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment