బొర్రాలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
అనంతగిరి:మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహల సమీపంలో రంగురాళ్ల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. బొర్రా పంచాయతీ పెద్దూరు, నిన్నిమామిడి, జీరుగెడ్డ, కొంట్యాసిమిడి, డెక్కాపురం తదితర గ్రామాల్లో మూడేళ్ల నుంచి రంగురాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ దొరికే రాళ్లు నాణ్యమైనవి కావడంతో మైదాన ప్రాంతాలతో పాటు ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గ్రామాల్లో మధ్యవర్తుల సహకారంతో స్థానిక గిరిజనులకు రోజువారి కూలి చెల్లించి మరీ తవ్వకాలు చేపడతున్నారు. గతంలో పోలీసుల దాడుల్లో చేపట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో వర్షాలు పడుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. పర్యాటక ప్రాంతం కావడంతో ఎవరూ పట్టించుకోరనే ధీమాతో వ్యాపారులు స్థానికులతో తవ్వకాలు జరుపుతున్నారు. రంగురాళ్ల తవ్వకాలపై స్థానిక ఎస్ఐ పి.దామోదరనాయుడు వద్ద ప్రస్తావించగా రంగురాళ్లు తవ్వుతున్నట్టు గతంలో సమాచారం రావడంతో కొంతమందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. తవ్వకాలు జరగకుండా నిఘా ఉంచామన్నారు. ఎక్కడైనా రంగురాళ్ల తవ్వకాలు చేపడుతున్నట్టయితే 9440904224 నెంబరుకు సమాచారం అందించాలని కోరారు.