borrampalem
-
తీవ్ర వాగ్వాదం.. ఆగిన సినిమా షూటింగ్
- ఆర్.నారాయణమూర్తిని అడ్డుకున్న స్థానిక నేతలు సాక్షి, హైదరాబాద్: విప్లవ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి లేదంటూ స్థానిక నాయకులు అడ్డుపడటంతో ఆయన అగ్రహానికి లోనయ్యారు. తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో చివరికి షూటింగ్ రద్దయింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ‘అన్నదాతా సుఖీభవ’ సినిమాను రూపొందిస్తున్న నారాయణమూర్తి.. యూనిట్‌తో కలిసి బొర్రంపాలెం వద్దగల పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద సినిమా షూటింగ్ తలపెట్టారు. అయితే అనుమతి లేకుండా సినిమా తీయవద్దంటూ గండేపల్లి జెడ్పీటీసీ యర్రంశెట్టి చంద్రరావు, కొందరు స్థానికులు షూటింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన నారాయణమూర్తి.. స్థానికులతో వాగ్వాదానికి దిగారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తోన్న మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. నారాయణమూర్తి సహా సినిమా యూనిట్ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ప్రస్తుతానికి ఎలాంటి కేసు నమోదుకాలేదు. -
యువకుడి బలవన్మరణం
టి.నరసాపురం: పొలం పనులు సరిగా చేయడం లేదని తల్లితండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. బొర్రంపాలానికి చెందిన కలపర్తి గంగరాజు కుమారుడు గోవర్దన (19) గురువారం ఉదయం పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతడ్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొం దుతూ గోవర్దన మృతిచెందాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి సమాచారం రావడంతో ఎస్సై కె.నాగేంద్రప్రసాద్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
ఒరిస్సా వెళ్లిన వలస కూలీలకు కామెర్లు
టి.నరసాపురం : మండలంలోని బొర్రంపాలెం నుంచి కూలిపనికి ఒరిస్సా వెళ్లిన కూలీలు కామెర్లతో బాధపడుతున్నారు. వీరిలో ఇద్దరు మరణించగా, ఐదుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామం నుంచి 15 రోజుల క్రితం 15 మంది కూలీలు ఒరిస్సాకు జామాయిల్ మొక్కలు నాటే పనికి వెళ్లారు. మూడురోజులు అక్కడే ఉండి పని ముగించుకుని మళ్లీ వచ్చేశారు. తిరిగి ఐదు రోజుల క్రితం మరికొందరు ఒరిస్సాకు పనికి వెళ్లారు. ముందుసారి వెళ్లిన వారు జ్వరం, కామెర్లతో బాధపడుతున్నారు. రెండోసారి వెళ్లిన వారిలో కొందరు అస్వస్థతకు గురికావడంతో తిరుగుముఖం పట్టారు. వీరిలో ఇద్దరు రాయగడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలపర్తి కృష్ణ(29) విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మూడురోజుల క్రితం గ్రామంలోనే గుండెవీరబాబు మరణించాడు. ప్రస్తుతం జంగారెడ్డిగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో చిన్ని ఏసుబాబు, కె.ఆదినారాయణ చికిత్స పొందుతున్నారు. గ్రామంలోనే ఇళ్ల వద్ద ఉండి వడ్లమూడి పుల్లారావు, వడ్లమూడి సుబ్బయ్య, సకలాబత్తుల భూషయ్య చికిత్స పొందుతున్నారు. ఈ విషయంపై స్థానిక వైద్యాధికారి రసూల్‌ను వివరణ కోరగా, కామెర్ల వ్యాధితో వలస కూలీలు బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, గురువారం గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని వివరించారు.