
తీవ్ర వాగ్వాదం.. ఆగిన సినిమా షూటింగ్
- ఆర్.నారాయణమూర్తిని అడ్డుకున్న స్థానిక నేతలు
సాక్షి, హైదరాబాద్: విప్లవ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తికి చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో షూటింగ్‌కు అనుమతి లేదంటూ స్థానిక నాయకులు అడ్డుపడటంతో ఆయన అగ్రహానికి లోనయ్యారు. తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో చివరికి షూటింగ్ రద్దయింది. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం బొర్రంపాలెం వద్ద శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రస్తుతం ‘అన్నదాతా సుఖీభవ’ సినిమాను రూపొందిస్తున్న నారాయణమూర్తి.. యూనిట్‌తో కలిసి బొర్రంపాలెం వద్దగల పుష్కర ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద సినిమా షూటింగ్ తలపెట్టారు. అయితే అనుమతి లేకుండా సినిమా తీయవద్దంటూ గండేపల్లి జెడ్పీటీసీ యర్రంశెట్టి చంద్రరావు, కొందరు స్థానికులు షూటింగ్‌ను అడ్డుకున్నారు.
దీంతో ఆగ్రహానికి లోనైన నారాయణమూర్తి.. స్థానికులతో వాగ్వాదానికి దిగారు. అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తోన్న మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. నారాయణమూర్తి సహా సినిమా యూనిట్ మొత్తం అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ప్రస్తుతానికి ఎలాంటి కేసు నమోదుకాలేదు.