హత్య కేసులో ఇద్దరికి యావజ్జీవం
అనంతపురంలో ఏడాదిన్నర కిందట జరిగిన హత్య కేసులో ఇద్దరు దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరానికి చెందిన అంబారపు మంగల రవికుమార్ వేధింపులు తాళలేక భార్య సంధ్యారాణి 2014లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో అరెస్టయ్యి.. బెయిలుపై వచ్చిన రవికుమార్‌పై బావమరిది నేరేడు జల్లా నాగేంద్ర కక్ష పెంచుకున్నాడు. బావను హత్య చేయటానికి స్నేహితులు కంబగిరి బాలకష్ణ,షేక్మౌలాలీతో కలిసి కుట్ర పన్నాడు. 2015 ఫిబ్రవరి రెండో తేదీ రాత్రి సుమారు 8.30 సమయంలో రామనగర్ రైలేగేటు వద్ద రొట్టెలు కొని ఇంటికి వెళుతున్న రవికుమార్‌ను ద్విచక్రవాహనంలో వచ్చి అటకాయించారు. అతని వెంట ఉన్న స్నేహితుడు మంగలశ్రీనివాస్ను బెదిరించడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఒంటరైన రవికుమార్‌ను సుత్తితో మోది.. పెట్రోలు పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో ఆస్పత్రి చేరిన రవికుమార్ మరుసటి రోజు మృతి చెందాడు.
అంతకు ముందే అతడి వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ నమోదుచేశారు. హత్యానేరం కూడా కలిపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్‌ప్రాసిక్యూటర్ బి.నాగలింగం 17 మంది సాక్ష్యులను విచారణ చేశారు. ప్రధాన నిందితుడు నాగేంద్ర, అతని స్నేహితుడు బాలకష్ణలపై నేరారోపణలు రుజువు కావడంతో ఇద్దరికీ యావజ్జీవ కఠిన కారాగారశిక్ష విధిస్తూ నాలుగవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి బి.సునీత తీర్పుచెప్పారు. మరొక నిందితుడు షేక్మౌలాలీపై నేరం రుజువుకాకపోవటంతో అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు.