యువ క్రికెటర్ల సత్తాకు పరీక్ష
ప్రిటోరియా: జాతీయ జట్టులో చోటు పదిలం చేసుకోవాలనుకుంటున్న భారత యువ ఆటగాళ్లకు ఓ మంచి అవకాశం లభించింది. దక్షిణాఫ్రికాలో బౌన్సీ పిచ్‌లపై చెలరేగితే జట్టులో దాదాపుగా చోటు ఖాయం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో పటిష్టమైన భారత్ ‘ఎ’ జట్టు నేడు (గురువారం) ఆస్ట్రేలియా ‘ఎ’తో తలపడనుంది. భారత సీనియర్ జట్టుకు ఆడిన సగం మంది ఆటగాళ్లు ప్రస్తుత టీమ్‌లో ఉన్నారు. చతేశ్వర్ పుజారా, రోహిత్, ధావన్, రైనా, హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అంబటి తిరుపతి రాయుడులు భారీ స్కోర్లు సాధించి టీమిండియాలో చోటు ఖాయం చేసుకోవాలని భావిస్తున్నారు.
జింబాబ్వే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పుజారా.. ఈ టోర్నీలో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికొస్తే ఈ టోర్నీలో కొత్త బౌలర్లను పరీక్షించే అవకాశం ఉంది. మహ్మద్ షమీ, జయదేవ్ ఉనాద్కట్లకు తోడుగా ఈశ్వర్ పాండే, సిద్ధార్థ్ కౌల్ తుది జట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. జమ్ము కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, జార్ఖండ్ స్పిన్నర్ షహబాజ్ నదీమ్‌లలో ఒక్కరికి చోటు దక్కొచ్చు.
మరోవైపు తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన ఆసీస్ జట్టు మంచి ఊపుమీదుంది. ప్రొటీస్‌తో మ్యాచ్‌లో షాన్ మార్ష్ 137 బంతుల్లో 136 పరుగులు చేసి జట్టుకు చక్కని విజయాన్ని అందించాడు.మాక్స్వెల్, నీల్, భారత సంతతి బౌలర్ గురీందర్ సంధులు తమ సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా పటిష్టమైన భారత బ్యాటింగ్ లైనప్‌కు నైపుణ్యం ఉన్న ఆసీస్ బౌలర్ల మధ్య పోరు రసవత్తరంగా జరగనుంది.