భారత్... ఐదు అత్యుత్తమ క్షణాలు
ఇప్పటివరకూ భారత్ అనేక టి20 మ్యాచ్‌లు ఆడింది. కానీ టి20 ప్రపంచకప్ అనగానే కళ్లముందు మెదిలే కొన్ని చిరస్మరణీయ విజయాలు, ప్రదర్శనలు ఉన్నాయి. వాటిని ఒకసారి అవలోకనం చేసుకుందాం...
భలే భలే బౌల్డ్ అవుట్
వేదిక: డర్బన్, తేదీ: సెప్టెంబర్ 14, 2007
ఫలితం: భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ‘టై’
బౌల్డ్ అవుట్లో 3-0తో టీమిండియా విజయం
ఏం జరిగింది: ముందుగా భారత్ 9 వికెట్లకు 141 పరుగులు చేయగా, పాక్ కూడా 7 వికెట్లకు సరిగ్గా 141 పరుగులు చేసింది. దాంతో ఫుట్‌బాల్‌లో ఉండే పెనాల్టీ షూటౌట్ తరహాలో తొలిసారి ‘బౌల్డ్ అవుట్’ను నిర్వహించారు. బ్యాట్స్‌మన్ లేకుండా బౌలింగ్‌తో స్టంప్స్‌ను పడగొట్టాలి. భారత్‌నుంచి సెహ్వాగ్, హర్భజన్, ఉతప్ప సఫలం కాగా... పాక్‌నుంచి అరాఫత్, గుల్, ఆఫ్రిది కనీసం స్టంప్స్ దగ్గరగా కూడా బంతి వేయలేకపోయారు.
ఒక్క షాట్ ఆటను మార్చేసింది
వేదిక: జొహన్నెస్‌బర్గ్
తేదీ: సెప్టెంబర్ 24, 2007
ఫలితం: ఫైనల్లో 5 పరుగులతో పాక్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది.
ఏం జరిగింది: భారత్ ముందుగా 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఛేదనలో పాక్ 19 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్లకు 145 పరుగులు చేసింది. జోగీందర్ శర్మ వేసిన చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా, తొలి రెండు బంతులకు 7 పరుగులు వచ్చాయి. మూడో బంతిని షార్ట్ ఫైన్ లెగ్ మీదుగా స్కూప్ షాట్ ఆడబోయి మిస్బా, శ్రీశాంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో టి20ల్లో కొత్త చరిత్ర మొదలైంది.
ఒకే ఒక్కడు...
వేదిక: సెయింట్ లూసియా, తేదీ: మే 2, 2010
ఫలితం: దక్షిణాఫ్రికాపై 14 పరుగులతో భారత్ విజయం
ఏం జరిగింది: భారత్ 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. సురేశ్ రైనా 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 బంతుల్లోనే 101 పరుగులు చేశాడు. టి20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు భారత్ తరఫున ఇదొక్కటే సెంచరీ కావడం విశేషం. ఆ తర్వాత దక్షిణాఫ్రికా 172 పరుగులు చేసింది.
భజ్జీ మాయాజాలం
వేదిక: కొలంబో, తేదీ: 23 సెప్టెంబర్, 2012
ఫలితం: 90 పరుగులతో ఇంగ్లండ్‌పై విజయం
ఏం జరిగింది: భారత్ 4 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఆ తర్వాత హర్భజన్ సింగ్ (4/12) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లండ్ 80 పరుగులకే కుప్పకూలింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత జట్టులో పునరాగమనం చేసిన భజ్జీ ఈ మ్యాచ్‌తో తన సత్తా చూపించాడు. ఏకంగా 17 డాట్ బాల్స్ వేశాడు.
అశ్విన్ తిప్పేశాడు
వేదిక: మిర్పూర్, తేదీ: మార్చి 30, 2014
ఫలితం: ఆస్ట్రేలియాపై 73 పరుగులతో భారత్ ఘనవిజయం
ఏం జరిగింది: యువీ అర్ధ సెంచరీతో భారత్ ముందుగా 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. అయితే అశ్విన్ దెబ్బకు కంగారూలు 86 పరుగులకే చేతులెత్తేశారు. పూర్తి కోటా కూడా బౌలింగ్ చేయకుండా 20 బంతులే వేసిన అశ్విన్ 11 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ప్రతీ ఓవర్లో ఒక్కో వికెట్ తీసిన అశ్విన్ ఆసీస్‌ను ఘోరంగా దెబ్బ తీశాడు.
- సాక్షి క్రీడావిభాగం