నలుగురు ఒలింపిక్ చాంపియన్లపై వేటు
డోపింగ్‌లో విఫలం
బుడాపెస్ట్: కజకిస్తాన్‌కు చెందిన నలుగురు ఒలింపిక్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్లు డోపీలుగా తేలారు. 2012 లండన్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన వీరి డోపింగ్ శాంపిళ్ల రీటెస్టులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య వీరిపై నిషేధం విధించింది. ఇందులో బీజింగ్, లండన్ గేమ్స్‌లో స్వర్ణాలు సాధించిన కజకిస్తాన్ స్టార్ ఇల్యా ఇల్యిన్ (94కేజీ)తో పాటు జుల్ఫియా చిన్షాన్లో (53కేజీ), మైయా మనేజా (63కేజీ), స్వెత్లానా పొడోబెడేవా (73కేజీ) ఉన్నారు.
అలాగే అజర్‌బైజాన్‌కు చెందిన ప్రపంచ చాంపియన్ బొయాంకా కొస్టొవా (58కేజీ), లండన్ గేమ్స్‌లో రజతం సాధించిన రష్యా లిఫ్టర్ అప్టి ఔఖడోవ్ (85కేజీ) కూడా ఉన్నారు. మరోవైపు వీరి పతకాలను వాపసు తీసుకోవడమే కాకుండా రియో గేమ్స్‌కు అనుమతించాలా? వద్దా? అనే విషయంపై త్వరలోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం కానుంది.