boycott election
-
గ్రామాల ఆగ్రహం.. ఓటింగ్‌కు దూరం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని మూడు గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది ఓటర్లు మంగళవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్‌ను బహిష్కరించారు. అయితే అనేక ఇతర గ్రామాల్లోనూ ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోవడంతో ఓటింగ్ ప్రక్రియకు పాక్షికంగా దూరంగా ఉన్నారని అధికారులు తెలిపారు.ప్రాథమిక సమాచారం మేరకు.. బరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామం, సూరత్ జిల్లాలోని సనాధార, బనస్కాంత జిల్లాలోని భఖారీ ఓటర్లు ఓటింగ్‌ను పూర్తిగా బహిష్కరించగా, జునాగఢ్ జిల్లాలోని భట్గాం గ్రామం, బోడోలి, మహిసాగర్ జిల్లాలోని కుంజర గ్రామాలు పాక్షికంగా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. సనాధార గ్రామం బార్డోలి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 320 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల సంఘం నివేదిక ప్రకారం.. స్థానిక ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు స్వయంగా వచ్చి అభ్యర్థించినా గ్రామస్తులు ఒక్క ఓటు కూడా వేయలేదు.పటాన్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే బఖ్రీ గ్రామంలోని దాదాపు 300 మంది ఓటర్లు తమ గ్రామ పంచాయతీ విభజనకు నిరసనగా సమిష్టిగా ఓటింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు ప్రయత్నించినప్పటికీ, గ్రామస్తులు తమ నిర్ణయం మార్చుకోలేదు. తెల్లవారుజాము నుంచే పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసి వేచి చూసినా గ్రామస్తులు ఓటేయడానికి రాలేదు. బీజేపీ అభ్యర్థి భరత్‌సింగ్ దాభి స్వయంగా గ్రామానికి వెళ్లి అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.భరూచ్ జిల్లాలోని కేసర్ గ్రామంలో దాదాపు 350 మంది ఓటర్లు కూడా ఒక్క ఓటు కూడా వేయలేదు. ఇక్కడ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి కాదు. నదిపై వంతెన నిర్మించాలని పలుమార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో గతంలో కూడా ఇలాగే చేశామని స్థానికులు తెలిపారు. గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్ జరిగింది. సూరత్ స్థానాన్ని బీజేపీ ఏకపక్షంగా గెలుచుకుంది. -
ఒక్కరు కూడా ఓటు వేయలేదు!
ముంబై: మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లా మనిబేలి గ్రామస్థులు సోమవారం నాటి అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలో 135 మంది ఓటర్లు ఉండగా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక్కరు కూడా ఓటు వేయలేదు. వీరు ఈ నాటి పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ముందుగానే ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడుస్తున్నా గ్రామానికి కరెంట్, రోడ్డు సౌకర్యం లేకపోవడమే పోలింగ్ బహిష్కరణకు కారణం. దేశంలో నూటికి నూరు శాతం విద్యుత్ సదుపాయాన్ని సాధించామని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్నప్పటికీ, రాష్ట్ర విద్యుత్ బోర్డు దృష్టిలో ఈ గ్రామం ఉన్నప్పటికీ విద్యుత్ సదుపాయం లేకపోవడం నిజంగా శోచనీయం. ఇంకా రాజకీయ నాయకుల వెంటబడి కరెంట్ కావాలి, రోడ్డు కావాలి అంటూ తిరిగే ఓపిక తమకు లేదని, ఓ ఆఖరి ప్రయత్నంగా అసెంబ్లీ పోలింగ్‌ను బహిష్కరించాలని నిర్ణయించామని నటర్వ్ భాయ్ టాడ్వీ అనే 60 ఏళ్ల వృద్ధుడు తెలిపారు. ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ కింద రెండేళ్ల క్రితం తమ గ్రామానికి 8 కిలోమీటర్ల రోడ్డు మంజూరు అయ్యిందని, అయితే అది ఇప్పటికీ కాగితాలకే పరిమితం అయిందని గ్రామస్థులు తెలిపారు. ఓ పక్క అడవి ప్రాంతం, మరో పక్క నర్మదా నడి డ్యామ్ బ్యాక్ వాటర్ ఉన్న కారణంగా ఆ గ్రామాన్ని అధికారులు పట్టించుకోవడం లేదని తెల్సింది. గిరిజనులు ఎక్కువగా ఉన్న నదూర్బార్ జిల్లాలో ఈ గ్రామం ఉండడం కూడా ఓ శాపంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గం నెంబర్ వన్ పరిధిలోకి వచ్చే అక్కల్కువా తహిసిల్‌లో ఈ గ్రామం ఉంది. (చదవండి: మహారాష్ట్ర, హరియాణా పోలింగ్ విశేషాలు) -
లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఓట్లేస్తాం!
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : సాగు నీరందించేందుకు లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని 7 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని నెల్లికల్, జాల్‌తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్తండా, చెంచో నితండా, మూలతండా గ్రామాల రైతులు రాజకీయపార్టీలకు అతీతంగా ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. లిఫ్టు నేపథ్యం.. : ఆ ఏడు గ్రామాలకు సాగు నీరందించేలా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు హామీలిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే పలు కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ లిఫ్టు నిర్మాణానికి అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవడానికి ప్రభుత్వం కూడా అనుమతులిచ్చింది. సుమారు 9 ఎకరాలు అటవీ భూమి మీదుగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్ రెవెన్యూ శివారులోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరిత ట్రిబ్యునల్‌కు ప్రభుత్వ భూమి బదలాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గతేడాది డిసెంబర్లో ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ నెల 20న హాలియాలో జరిగిన సమావేశంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్టు ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చా యని జనవరిలో పనులు ప్రారంభవుతాయని తెలిపారు. ఈ లిఫ్టు పూర్తయితే ఆ ఏడు గ్రామాల్లో మొత్తం 7,262 ఎకరాలకు సాగునీరు అందుతుంది. -
నమ్మకం పోయింది... ఎన్నికలు బహిష్కరిస్తున్నాం
రానున్న లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ముజఫర్‌నగర్ అల్లర్లతో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలు ప్రకటించాయి. అల్లర్లు వల్ల ముజఫర్‌నగర్ జిల్లాలోని లంక్, సిసొలి, బిట్వాడ గ్రామాల నుంచి పలు కుటుంబాలు బల్వా గ్రామానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ సందర్భంగా అయా గ్రామాల ప్రజలు శనివారం బల్వాలో మాట్లాడుతూ... రాజకీయ నాయకులపై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని తెలిపారు. రాజకీయ నాయకులకు ఓటు వేసి గెలిపించిన తమకు ఒరిగేది లేదని వారు నిరాసక్తత వ్యక్తం చేశారు. అనాటి ఘటనలు గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమైయ్యారు. ఆ ఘటన తమ హృదయాలపై బలంగా ముద్రితమైందన్నారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తాము తేరుకోలేదన్నారు. ఆ సంఘటన జరిగన తర్వాత కనీసం ఒక్కనాయకుడు కూడా వచ్చి మేమున్నామంటూ తమకు భరోసా కల్పించలేదని ఆరోపించారు. అయితే అల్లర్లు కారణంగా తమ గ్రామానికి వచ్చి ఆశ్రయం పొందుతున్న దాదాపు 66 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని బిల్వ గ్రామ అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. వారందరికి ఓటర్లు జాబితాలో పేర్లు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్‌నగర్‌లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో మంది నిరాశ్రయులైయ్యారు. ఆ అల్లర్లకు భయపడి అనేక మంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లి ఆశ్రయం పొందుతున్నారు.