ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మరో ప్రాంతానికి తరలిపోతున్న బాధితులు (ఫైలు ఫోటో)
రానున్న లోక్సభ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ముజఫర్నగర్ అల్లర్లతో నిరాశ్రయులైన బాధిత కుటుంబాలు ప్రకటించాయి. అల్లర్లు వల్ల ముజఫర్నగర్ జిల్లాలోని లంక్, సిసొలి, బిట్వాడ గ్రామాల నుంచి పలు కుటుంబాలు బల్వా గ్రామానికి తరలివెళ్లాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబాలు తిరిగి స్వగ్రామాలకు వచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఈ సందర్భంగా అయా గ్రామాల ప్రజలు శనివారం బల్వాలో మాట్లాడుతూ... రాజకీయ నాయకులపై తమకు ఉన్న నమ్మకం పూర్తిగా పోయిందని తెలిపారు. రాజకీయ నాయకులకు ఓటు వేసి గెలిపించిన తమకు ఒరిగేది లేదని వారు నిరాసక్తత వ్యక్తం చేశారు.
అనాటి ఘటనలు గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమైయ్యారు. ఆ ఘటన తమ హృదయాలపై బలంగా ముద్రితమైందన్నారు. ఆ దుర్ఘటన నుంచి ఇంకా తాము తేరుకోలేదన్నారు. ఆ సంఘటన జరిగన తర్వాత కనీసం ఒక్కనాయకుడు కూడా వచ్చి మేమున్నామంటూ తమకు భరోసా కల్పించలేదని ఆరోపించారు. అయితే అల్లర్లు కారణంగా తమ గ్రామానికి వచ్చి ఆశ్రయం పొందుతున్న దాదాపు 66 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని బిల్వ గ్రామ అధ్యక్షుడు మహ్మద్ ఇమ్రాన్ తెలిపారు. వారందరికి ఓటర్లు జాబితాలో పేర్లు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
గతేడాది సెప్టెంబర్లో ఉత్తరప్రదేశ్లో ముజఫర్నగర్లో మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో దాదాపు 60 మందికి పైగా మరణించారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతో మంది నిరాశ్రయులైయ్యారు. ఆ అల్లర్లకు భయపడి అనేక మంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలివెళ్లి ఆశ్రయం పొందుతున్నారు.