
ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేస్తోన్న గ్రామస్తులు
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : సాగు నీరందించేందుకు లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని 7 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని నెల్లికల్, జాల్‌తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్తండా, చెంచో నితండా, మూలతండా గ్రామాల రైతులు రాజకీయపార్టీలకు అతీతంగా ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు.
లిఫ్టు నేపథ్యం.. : ఆ ఏడు గ్రామాలకు సాగు నీరందించేలా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు హామీలిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే పలు కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ లిఫ్టు నిర్మాణానికి అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవడానికి ప్రభుత్వం కూడా అనుమతులిచ్చింది. సుమారు 9 ఎకరాలు అటవీ భూమి మీదుగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్ రెవెన్యూ శివారులోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరిత ట్రిబ్యునల్‌కు ప్రభుత్వ భూమి బదలాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ నెల 20న హాలియాలో జరిగిన సమావేశంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్టు ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చా యని జనవరిలో పనులు ప్రారంభవుతాయని తెలిపారు. ఈ లిఫ్టు పూర్తయితే ఆ ఏడు గ్రామాల్లో మొత్తం 7,262 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
Comments
Please login to add a commentAdd a comment