Boyfriend Fraud
-
మరో ప్రేమకథ.. ప్రియుడిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి వచ్చి...
కోల్‌కతా: సినిమా కథను తలపిస్తూ సాగిన పబ్జీ ప్రేమ జంట కథ మరువక ముందే అలాంటి మరో కథ పశ్చిమ బెంగాల్ సిలిగురిలో ఆవిష్కృతమైంది. ఆ కథలో ప్రియురాలు పాకిస్తాన్ నుంచి భారత దేశానికి వస్తే ఈ కథలో బంగ్లాదేశ్ నుంచి ప్రియురాలు ప్రియుడిని వెతుక్కుంటూ బెంగాల్ వచ్చింది. కాకపొతే ఆ కథ సుఖాంతమైంది ఈ కథ విషాదాంతమైంది. రెండున్నర నెలల క్రితం సప్లా అఖ్తర్ అనే మహిళ ఆన్లైన్ లో పరిచయమైన బాయ్ ఫ్రెండుని కలుసుకునేందుకు బంగ్లాదేశ్ నుండి భారత్ బయలుదేరి వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని సిలిగురికి చేరుకొని తన బాయ్ ఫ్రెండుని కలుసుకుంది కూడా. కానీ తన ప్రియుడు తనని నేపాల్‌లో ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకుని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుండి తప్పించుకుంది. ప్రేమించిన వాడితో జీవితం రంగులమయంగా ఉంటుందని ఊహించుకుని దేశాలు దాటి వచ్చిన సప్లాకు బాయ్ ఫ్రెండ్ నిజస్వరూపం తెలుసుకుని షాక్‌లో ఉండిపోయింది. ఎలాగైనా తన దేశానికి తిరుగు ప్రయాణమవ్వాలన్న ఆలోచనతో సిలిగురి రైల్వే జంక్షన్ చేరింది. చేతిలో డబ్బులు లేక అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను వివరం అడిగి తెలుసుకున్నారు ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిధి. యువతికి సాయం చేసే ఉద్దేశ్యంతో విషయాన్ని స్థానిక ప్రధాన్ నగర్ పోలీస్ స్టేషన్ లో నివేదించగా పోలీసులు ఆమె మీద అక్రమ చొరబాటు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పాపం సప్లా.. ప్రేమ గుడ్డిదని తెలుసుకునేసరికి తన జీవితమే తెల్లారిపోయింది. దిక్కుమాలిన ప్రేమ కోసం దేశాలు దాటి వచ్చి ఊచలు లెక్కపెడుతోంది. ప్రియుడు పరారీలో ఉండగా పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌లో అద్భుతం.. తెగిన తలను అతికించారు.. -
‘గణేష్ లేకపోతే నేను బతకలేను’
సాక్షి, చిత్తూరు : పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పలమనేరు పెద్దపంజాని మండలానికి చెందిన శ్రావణి, గణేష్‌లు గత ఆరేళ్లు ప్రేమించుకుంటున్నారు. బెంగళూరులో కలిసి సహజీవనం చేశారు. కరోనా సమయంలో గణేష్ సొంతగ్రామానికి వెళ్లాడు. కొద్ది రోజుల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. కొద్ది రోజుల తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్నప్రియురాలు శ్రావణి రెండు రోజులుగా ఆందోళన దిగారు. గణేష్ తనకు కావాలని, ఆయన లేకుంటే బతకలేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు శనివారం ఆమె వీడియో సెల్ఫీ వీడియోని మీడియాకు విడుదల చేశారు ‘నేను గణేష్ ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాము. పెళ్లికి ముందు రోజు కూడా నాతో రెండున్నర గంటల సేపు మాట్లాడడం జరిగింది. నువ్వు లేకుండా నేను బతకలేను అనేసి నాతో చెప్పాడు. కానీ రాత్రికి రాత్రే ఏం జరిగిందో తెలియడం లేదు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తన అమ్మనాన్నలు ఏం చెప్పి తనని పెళ్లి ఒప్పించారో అర్థం కాలేదు. నాకు గణేష్ కావాలి. గణేష్ లేకపోతే నేను బతకలేను. చావే నాకు శరణ్యం’ అంటూ శ్రావణి కన్నీంటి పర్యంతమయ్యారు. -
మోసపోయిన యువతి కథ సుఖాంతం
- ఇరు కుటుంబాల వారితో చర్చించి ఒప్పించిన ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు - మోసగించిన యువకుడితో పెళ్లి జరిపించిన వైనం పెద్దపంజాణి: ప్రియుడి చేతిలో మోసపోయిన యువతి కథ గురువారం సుఖాంతమైంది. పెద్దపంజాణి మండలం ముత్తుకూరు పంచాయతీ పరిధిలో గల పోలేపల్లె గ్రామానికి చెందిన జ్యోతి(19)కి ఆరు నెలల క్రితం అరగొండ సమీపంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్ మిస్డ్ కాల్‌తో పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. నెల రోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పలమనేరులో ఒక అద్దె ఇల్లు తీసుకుని కలిసి ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం కోసం వెళుతున్నట్లు చెప్పి ప్రేమ్‌కుమార్ ఆమెను వదిలించుకున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న యువతి పెద్దపంజాణి పోలీసులను ఆశ్రయించింది. ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ప్రేమ్‌కుమార్ జాడ తెలుసుకుని ఇరు కుటుంబాలతో చర్చించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. పెద్దపంజాణి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పెళ్లి జరిపించారు. దీంతో మిస్డ్ కాల్ ప్రేమ కాస్త పెళ్లితో సుఖాంతమైంది. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి సుజాతను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏసీడీపీవో ఎల్లమ్మ, సూపర్వైజర్ సులోచన ఉన్నారు.