డ్రైనేజీ క్లీన్ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి సమీపంలోని మురికివాడలో డ్రైనేజీ క్లీన్ చేశారు. పేదలు ఎక్కువగా నివసించే బీఆర్ క్యాంపు ప్రాంతంలో మురికి కాలువలను శుభ్రం చేసే పనుల్లో సఫాయి కార్మికులతో పాటు ఆయన పాల్గొన్నారు. తర్వాత వారితో కలిసి టీ కూడా సేవించారని 'ఆప్' వర్గాలు వెల్లడించాయి.
బీఆర్ క్యాంపు తన నియోజకవర్గంలోనే ఉండడంతో ఆయనీ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్టోబర్ 2 నుంచి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు 'ఆప్' ట్వీట్ చేసింది. తమ ఎమ్మెల్యేలందరూ ఇందులో పాల్లొంటారని పేర్కొంది. ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ తాము భాగస్వాములం కాబోమని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ గురువారం 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో ప్రారంభించిన నేపథ్యంలో 'ఆప్' కూడా 'క్లీన్' కార్యక్రమం చేపట్టింది.