టీడీపీ పాలనలో దేవుళ్లకూ రక్షణ లేదు
సాక్షి, అమరావతి బ్యూరో: టీడీపీ పాలనలో సామాన్యులకే కాదు.. దేవుళ్లకూ రక్షణ కరువైందని బ్రాహ్మణ ఐక్య వేదిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. దుర్గగుడితో పాటు తిరుమలలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. బ్రాహ్మణుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ తీరును నిరసిస్తూ బుధవారం విజయవాడ బెంజ్ సర్కిల్లోని ఆంజనేయస్వామి ఆలయం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు బ్రాహ్మణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ.. దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం, తిరుమల ఆలయంలో అపచారం జరగడం వంటి ఘటనలు హైందవ ధర్మంపై జరుగుతున్న దాడులకు నిదర్శనమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన బ్రాహ్మణులను చంద్రబాబు సర్కార్ వేధిస్తోందని మండిపడ్డారు.
తిరుమల ప్రతిష్టను మంటగలిపేలా తీసుకుంటున్న నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయన్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా శ్రీవారి కైంకర్యాలు నిర్వహించడం దారుణమన్నారు. తిరుమల కొండపై జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే రమణ దీక్షితులను ఆలయ ప్రధాన అర్చకత్వ పదవి నుంచి తప్పించి కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో జరిగిన ఘటనలపై వెంటనే సీబీఐతో విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
అలాగే అర్చకుల సంక్షేమం కోసం విడుదల చేసిన జీవో 76ను తక్షణమే అమలు చేయాలన్నారు. పదవీ విరమణ వయసు నిర్ణయించి తొలగించడానికి అర్చకులేమీ ప్రభుత్వ ఉద్యోగులు కాదని, వారికి ఎలాంటి బెనిఫిట్స్ అందవన్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలకు వ్యతిరేకంగా బెజవాడలో బ్రాహ్మణ ఐక్యవేదిక చేపట్టిన ర్యాలీకి వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సంఘీభావం తెలిపారు. బ్రాహ్మణులు, అర్చకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హేయమైనవని మండిపడ్డారు. అర్చకులపై కక్ష సాధింపు చర్యలను వెంటనే ఆపాలని మల్లాది విష్ణు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.