రాజధానిలో బ్రాహ్మణ సదనం
► అన్ని హంగులతో నిర్మాణం
► ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
► 10 నుంచి 12 ఎకరాల స్థల సేకరణకు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణుల సంక్షేమం, ఆ సామాజిక వర్గంలోని పేదల అభివృద్ధికి తమ ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. హైదరాబాద్‌లో 10-12 ఎకరాల విస్తీర్ణంలో బ్రాహ్మణ సదనం నిర్మిస్తామని వెల్లడించారు. ఆదివారం ఇక్కడి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో బ్రాహ్మణుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. బ్రాహ్మణులతో తనకు, తన కుటుంబానికి దశాబ్దాలుగా అనుబంధముందని, 1985లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దేశంలోనే తొలిసారిగా సిద్దిపేటలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించినట్లు చెప్పారు. బ్రాహ్మణుల జీవన స్థితిగతులను దగ్గరుండి చూశానని, వారి ఆశీర్వాదంతో ఎదిగానని, ముహూర్తాలు లేని సమయంలో బ్రాహ్మణులు అనుభవించే ఆర్థిక సమస్యలూ తనకు తెలుసునన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రం వచ్చాక సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. బ్రాహ్మణులు నిర్లక్ష్యానికి గురికావద్దు. వారి పేదరికాన్ని తొలగించాల్సి ఉంది. వారి సంక్షేమానికి బడ్జెట్లో రూ. వంద కోట్లు కేటాయించాం. వాటి ద్వారా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించే బాధ్యతను బ్రాహ్మణ ట్రస్టుకు అప్పగిస్తాం’’ అని సీఎం చెప్పారు. సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఆర్. విద్యాసాగర్‌రావు, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే ఒడితెల సతీశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పలువురు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
అన్ని హంగులతో బ్రాహ్మణ సదనం...
అన్ని హంగులతో బ్రాహ్మణ సదనం నిర్మిస్తామని, ఆచారం, సంప్రదాయాలు, పవిత్రత నెలకొనేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. బ్రాహ్మణ సమాజోద్ధరణ వేదికగా సదనం మారాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కణ్ణుంచి పీఠాధిపతులు, పండితులు హైదరాబాద్ వచ్చినా బ్రాహ్మణ సదనంలో బస చేసే వీలు కల్పించాలని, వెంటనే సదనానికి స్థల సేకరణ జరగాలన్నారు. అదే చోట బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టల్ నిర్మిస్తామని, విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తామని సీఎం పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బ్రాహ్మణ సదనం అడ్హాక్ కమిటీని నియమించారు. కేవీ రమణాచారి, సువర్ణ సులోచన, గీతామూర్తి, రంగరాజన్, వ్యాకరణం నాగేశ్వర్రావు, కేఆర్ నందన్, సీఎల్ రాజం, శివశంకర్, తిగుళ్ల కృష్ణమూర్తిలతో కమిటీని ఏర్పాటు చేశారు. అరవిందరావు, ఐవైఆర్ కృష్ణారావు, ధన్వంతరి కమలాకర్ శర్మలను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.
అర్చకుల జీతభత్యాలపై కమిటీ
తెలంగాణ ఆర్థికంగా బాగుందని, ఆధ్యాత్మికంగానూ బాగుండాలని సీఎం అభిప్రాయపడ్డారు. అర్చకులకు మంచి జీతభత్యాలు అందించటంతోపాటు వారి గౌరవం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో కమిటీ వేసి అధ్యయనం చేస్తామన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధికి పనిచేసే ట్రస్టును ఏర్పాటు చేసి అందులోనే వివిధ విభాగాలను ఏర్పాటు చేయాలి. దేవాలయాలకు కేటాయించిన భూములు, మాన్యాలు అన్యాక్రాంతమవుతున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు.
బ్రాహ్మణుల్లో పేదల సంక్షేమానికి బహుముఖ వ్యూహం అవలంబిం చాల్సి ఉందన్నారు. బ్రాహ్మణుల్లో పురోహితులు, పారిశ్రామిక రంగంలో ఆసక్తిగలవారు, చదువుకునేవారు, ఉపాధి కల్పనకు ప్రయత్నించే వారున్నారనీ, అందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. పౌరోహిత్యాన్ని వృత్తిగా చేపట్టే వారికి పెళ్లి కూడా కాని పరిస్థితి నెలకొనడం బాధాకరమని, వారి జీవన స్థితిగతులు మెరుగుపరిచే వ్యూహం రూపొం దిస్తామని సీఎం హామీ ఇచ్చారు.