‘డీజే’ సినిమాలో పాటను తొలగించాలి
బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్
సిటీబ్యూరో: ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’ సినిమాలో అసందర్భ ప్రేలాపనలతో, బ్రాహ్మణులను కించపరిచేలా రాసిన పాటను తొలగించాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ కో–ఆర్డినేటర్లు గోగులపాటి కృష్ణమోహన్, ఆలూరి, పిల్లుట్ల ఆనంద్‌మోహన్ హెచ్చరించారు. సినిమాల్లో బ్రాహ్మణులను హీనంగా చూపడం అలవాటుగా మారిందని, ఇప్పుడది పాటలకూ విస్తరించిందని శుక్రవారం వారొక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నెల 23న విడుదల కానున్న ‘డీజే’ సినిమాలో ‘సాహితి’ పేరుతో చెరుకుపల్లి శ్రీరామచంద్రమూర్తి రాసిన ‘అస్మిక యోగ తస్మిక భోగ’ అనే ప్రణయ గీతంలో రుద్ర స్తోత్రంలోని పదాలను చొప్పించి, హిందువుల.. ముఖ్యం గా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. ఈ పాటలో ‘ప్రవర’ అనే పదాన్ని అపహాస్యం చేశారన్నారు. పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమని తాము పరిచయం చేసుకునేందుకు అభివాదం చేస్తూ గోత్ర ‘ప్రవర’లు ప్రస్తావించేవారని, అటువంటి ‘ప్రవర’ను అపహాస్యం చేస్తూ ‘ప్రవరలో ప్రణయ మంత్రాన్ని’ అంటూ చరణాలు రాయడం శోచనీయమన్నారు.
పూర్వం బ్రాహ్మణులుండే ప్రాంతాలను అగ్రహారాలనే వారని. బ్రాహ్మణులు తాంబూల ప్రియులని, దీని ఆధారంగా ‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’ అంటూ మరో ప్రయోగం చేయడం దుస్సాహసమన్నారు. బ్రాహ్మణులను కించపరిచేలా పాట రాసిన ‘సాహితి’ తన తప్పును ఒప్పుకొని బ్రాహ్మణులకు, హిందూజాతికి క్షమాపణలు చెప్పాలని బ్రాహ్మిణ్స్ యూనిటీ ఫరెవర్ డిమాండ్ చేసింది.