గణనీయంగా పెరుగుతున్న అవయవ దానాలు
- ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 15 మంది దానం
- 24 మందికి అవయవాల మార్పిడి
సాక్షి, ముంబై: రెండు వారాల్లో 10 మంది అవయవ దానం వల్ల ఈ ఏడాది దానం చేసిన వారి సంఖ్య 15కు చేరుకుంది. వీరి ద్వారా 24 మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఇటీవల 55 ఏళ్ల వ్యక్తి బ్రెయిన్ హ్యూమరేజ్‌కు గురవ్వడంతో ఆ వ్యక్తి బంధువులు తన రెండు కిడ్నీలు, లివర్ దానం చేశారు. అలాగే మరో 60 ఏళ్ల వృద్ధుడు బ్రెయిన్ హ్యూమరేజ్‌తో మృతిచెందడంతో తన అవయవాలు కూడా దానం చేశారు. గత రెండు వారాలుగా 10 మంది అవయవాలను మార్పిడి చేశామని, 24 మందికి కొత్త జీవితాలు పొందారని వైద్యులు తెలిపారు.
ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి అవయవాలు ఎక్కువగాపొందుతున్నామని, అయితే ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బ్రెయిన్ డెడ్ రోగులు ఎక్కువగా వస్తుంటారని ఆరోగ్య నిపుణులు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇంకా అవయవ దానంలో వెనుకబడి ఉన్నాయన్నారు. అవయవ దానంలో ప్రభుత్వ ఆస్పత్రులు వెనుకబడటానికి గల కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఫోర్టిస్ ఆస్పత్రికి చెందిన లివర్ మార్పిడి సర్జన్ డాక్టర్ రాకేష్ రాయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది అవయవ దానం చేసిన వారి సంఖ్య గణనీయంగా పెరగడం శుభ సూచకం అన్నారు.
వివిధ ఆస్పత్రుల నుంచి దానం చేసిన అవయవాలను పొందుతున్నామని, అయితే ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘమైందని అన్నారు. ముంబై జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ కమిటీ.. నగరంలో అవయవ దానం పట్ల మరింత అవగాహన పెంపొందించాలని నిర్ణయించింది. కాగా, 2012లో 26 మంది అవయవ దానం చేశారు. ఆ సమయంలో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ లివర్ విఫలం చెంది మరణించడంతో ఈ అంశం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. అదేవిధంగా 2014లో 41మంది అవయవ దానం చేయగా 107 మంది ప్రయోజనం పొందారు.