ప్రాథమికోన్నత పాఠశాలల అప్‌గ్రేడ్‌కు బ్రేక్
హుజూర్నగర్ :ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రవే శపెడుతూ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఈ నెల 5న ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశానుసారం విద్యా సంవత్సరం ప్రారంభంలో జిల్లాలోని 288 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రారంభించి విద్యార్థుల అడ్మిషన్లు పూర్తి చేయడంతోపాటు పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేశారు. అంతేగాక ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబోధనను ప్రారంభించి సం బంధిత సబ్జెక్టులకు ఉపాధ్యాయులను కూడా సర్దుబాటు చేసుకోవడం జరిగింది.
దీంతో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు 8వ తరగతి చదువుకునేందుకు ఇతర పాఠశాలలకు వెళ్లకుండా మంచి ప్రయోజనకరంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో విద్యాశాఖ అకస్మాత్తుగా జిల్లాలోని 288 పాఠశాలల్లో కేవలం 6 పాఠశాలల్లో మాత్రమే 8వ తరగతి ప్రవేశపెడుతున్నట్లుగా మిగిలిన 282 పాఠశాలల్లో 8వ తరగతి రద్దు చేస్తున్నామని, విద్యార్థులను ఇతర పాఠశాలల్లోకి పంపించాలని ఆదేశిస్తూ ఎంఈఓలకు సమాచారం చేరవేసింది. అంతేగాక సదరు విద్యార్థులు ఇతర ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేరిన వారికి మాత్రమే ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయాలని ఆదేశించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం..
జిల్లాలోని త్రిపురారం మండలం కామారెడ్డిగూడెం, మునుగోడు మండలం పులిపలుపుల, మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం, అనుమల మండలం అల్వాల, పీఏపల్లి మండలం మేడవరం, కోదాడ మండలం మొగలాయికోటలలోని మొత్తం 6 ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రమే 8వ తరగతిని కొనసాగించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. అయితే గత నెల 12న పాఠశాలలను పునఃప్రారంభించి ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని ప్రవేశపెట్టిన ప్రభుత్వం కేవలం 22 రోజులలోనే తన నిర్ణయాన్ని మార్చుకుని విద్యార్థుల భవితవ్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పించాలంటే ఎలా అంటూ వాపోతున్నారు. విద్యాశాఖ తన నిర్ణయాన్ని మార్చుకొని యథావిధిగా 8వ తరగతిని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొనసాగించాలని కోరుతున్నారు.