bramotsavalu
-
సీఎం జగన్‌ను కలిసిన కాణిపాకం అర్చకులు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాణిపాకం ఆలయ అర్చకులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వినాయకచవితి పురస్కరించుకొని కాణిపాకంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సావాలకు హాజరు కావాలని సీఎం జగన్‌కు ఆహ్వనపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు జగన్‌కు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పుణేలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
పుణే సిటీ : పుణే ఘోర్పడి ప్రాంతంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి కల్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగి పోయింది. కల్యాణోత్సవంలో శ్రీవారికి పట్టువస్త్రాలను అందించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్సవం నిర్వహించారు. శ్రీవారికి శ్రీదేవి, భూదేవిల అప్పగింతల కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. ఈ వేడుకలు చూసేందుకు పట్టణంలోని తెలుగువారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు శ్రీవారి ప్రసాదం లడ్డూను భక్తులకు అందజేశారు. కాగా, దాదాపు 30 వేల మందికి మహాప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమాలలో ఆదివారం పుణే పార్లమెంట్ సభ్యులు అనిల్ శిరోలె పాల్గొనగా, సోమవారం స్థానిక కార్పొరేటర్లు మంగళా మంత్రి ఉమేష్ గైక్వాడ్, మాజీ డిప్యూటీ మేయర్ ప్రకాశ్ మంత్రి పాల్గొన్నారు. కాగా, సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దొంగరి సుబ్బారాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్ల మాధవ రావు, రాజేంద్ర రావు, కల్లూరి భాస్కర్‌రెడ్డి, కె.బలరాం, కామనబోయిన చెంచయ్య, ఉపాధ్యక్షులు దుగ్గిరెడ్డి మాధవరెడ్డి, వి.ఎస్.చలసాని, పాలగిరి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు సావ నారాయణ, శ్రీనివాస్ భండారి, బొర్రాజు తిరుపతయ్య, పాలగిరి భాస్కర్‌రెడ్డి, సురేశ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
సూర్య చంద్రార్క ప్రభ.. శేషాచల శోభ
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు సాక్షాత్కరించారు. పంచాయుధాలను ధరించి నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని ఉభయదేవేరులతో చినవెంకన్న అధిరోహించారు. లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యనారాయణుడను నేనేనంటూ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శ్రీవారి వాహన సేవల్లో సూర్యప్రభ వాహనానికి విశేష ప్రాధాన్యముంది. చిరుమందహాసధారిౖయెన శ్రీనివాసుడు తన అభయహస్తంతో ఉత్సవ వైభవాన్ని వీక్షించిన భక్తులకు వరాలు కురిపిస్తున్నట్టు కనువిందు చేశారు. సూర్యుడు రథసారథి సప్తఅశ్వాలను ఏ విధంగా అదుపులో ఉంచుతూ రథాన్ని నడిపిస్తాడో.. అదేవిధంగా మానవుడు తనలోని సప్తవ్యసనాలను అదుపులో ఉంచుకుని శ్రీమన్నారాయణుని శరణాగతి పొందితే తప్పక ముక్తి లభిస్తుందని సూర్యప్రభ వాహనసేవ అర్థమని పండితులు చెబుతున్నారు. నవనీత కృష్ణ అలంకరణలో.. నవనీత కృష్ణ అలంకరణలో రాత్రి ఉభయదేవేరులతో స్వామివారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గజవాహన సేవతో శ్రీవారు భక్తులను కటాక్షించారు. గోవిందనామస్మరణల నడుమ చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నేడు ఉదయం 7 గంటలకు – హనుమద్వాహనంపై గ్రామోత్సవం ఉదయం 8 గంటలకు – వాసవి భజన మండలి సంకీర్తనల ఆలాపన ఉదయం 9.30 గంటలకు – కూచిపూడి నృత్యం సాయంత్రం 5 గంటలకు – ఉపన్యాసం సాయంత్రం 6 గంటలకు – బుర్రకథ రాత్రి 7 గంటలకు – కూచిపూడి నృత్యం రాత్రి 7 గంటలకు – ఎదుర్కోలు ఉత్సవం రాత్రి 8 గంటలకు – కూచిపూడి నృత్యం రాత్రి 8.30 గంటలకు – వెండి శేష వాహనంపై గ్రామోత్సవం కాంతుల రవళి.. శ్రీవారి లోగిలి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి క్షేత్రం విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కల్యాణోత్సవాల్లో విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ రాజగోపురాలు, పరిసరాల సముదాయం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ కటౌట్లు, గరుడాళ్వార్ విగ్రహ ప్రాంతంలో స్వాగత కటౌట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొండపైన శ్రీరామ పట్టాభిషేకం, గుడి సెంటర్లో భగవద్గీత ఘట్టం, ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు కనువిందు చేస్తున్నాయి.