సూర్య చంద్రార్క ప్రభ.. శేషాచల శోభ | surya chandraraka prabha.. seshachela sobha | Sakshi
Sakshi News home page

సూర్య చంద్రార్క ప్రభ.. శేషాచల శోభ

Published Thu, Oct 13 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

సూర్య చంద్రార్క ప్రభ.. శేషాచల శోభ

సూర్య చంద్రార్క ప్రభ.. శేషాచల శోభ

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దివ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ వాహనంపై, రాత్రి చంద్రప్రభ వాహనంపై శ్రీవారు తిరువీధుల్లో భక్తులకు సాక్షాత్కరించారు. పంచాయుధాలను ధరించి నారాయణమూర్తి అలంకరణలో సూర్యప్రభ వాహనాన్ని ఉభయదేవేరులతో చినవెంకన్న అధిరోహించారు. లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యనారాయణుడను నేనేనంటూ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. శ్రీవారి వాహన సేవల్లో సూర్యప్రభ వాహనానికి విశేష ప్రాధాన్యముంది. చిరుమందహాసధారిౖయెన శ్రీనివాసుడు తన అభయహస్తంతో ఉత్సవ వైభవాన్ని వీక్షించిన భక్తులకు వరాలు కురిపిస్తున్నట్టు కనువిందు చేశారు. సూర్యుడు రథసారథి సప్తఅశ్వాలను ఏ విధంగా అదుపులో ఉంచుతూ రథాన్ని నడిపిస్తాడో.. అదేవిధంగా మానవుడు తనలోని సప్తవ్యసనాలను అదుపులో ఉంచుకుని శ్రీమన్నారాయణుని శరణాగతి పొందితే తప్పక ముక్తి లభిస్తుందని సూర్యప్రభ వాహనసేవ అర్థమని పండితులు చెబుతున్నారు. 
నవనీత కృష్ణ అలంకరణలో..
నవనీత కృష్ణ అలంకరణలో రాత్రి ఉభయదేవేరులతో స్వామివారు చంద్రప్రభ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ గజవాహన సేవతో శ్రీవారు భక్తులను కటాక్షించారు. గోవిందనామస్మరణల నడుమ  చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. 
 బ్రహ్మోత్సవాల్లో నేడు
ఉదయం 7 గంటలకు – హనుమద్వాహనంపై గ్రామోత్సవం 
ఉదయం 8 గంటలకు – వాసవి భజన మండలి సంకీర్తనల ఆలాపన
ఉదయం 9.30 గంటలకు – కూచిపూడి నృత్యం
సాయంత్రం 5 గంటలకు – ఉపన్యాసం
సాయంత్రం 6 గంటలకు – బుర్రకథ
రాత్రి 7 గంటలకు – కూచిపూడి నృత్యం
రాత్రి 7 గంటలకు – ఎదుర్కోలు ఉత్సవం 
రాత్రి 8 గంటలకు – కూచిపూడి నృత్యం
రాత్రి 8.30 గంటలకు – వెండి శేష వాహనంపై గ్రామోత్సవం 
కాంతుల రవళి.. శ్రీవారి లోగిలి 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి క్షేత్రం విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కల్యాణోత్సవాల్లో విద్యుత్‌ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ రాజగోపురాలు, పరిసరాల సముదాయం, తూర్పు రాజగోపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన భారీ విద్యుత్‌ కటౌట్‌లు, గరుడాళ్వార్‌ విగ్రహ ప్రాంతంలో స్వాగత కటౌట్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొండపైన శ్రీరామ పట్టాభిషేకం, గుడి సెంటర్‌లో భగవద్గీత ఘట్టం,  ఆలయ పరిసరాల్లో ఏర్పాటుచేసిన దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్‌లు కనువిందు చేస్తున్నాయి. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement