ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
వాడపల్లి (ఆత్రేయపురం):
కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలను బుధవారం ఆలయ ఈవో బీహెచ్ రమణమూర్తి వైభవంగా ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన యాగశాల వద్ద హోమంలో పాల్గొన్నారు. వైఖానస ఆగమోక్తంగా యువబ్రహ్మ ఆగమ భాస్కర ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు కార్యక్రమాలను నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయాన్ని విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం 9.45 గంటలకు స్వస్తివచనం, విష్వక్సేన పూజ, పుణ్యావచనం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు శేషవాహన సేవ, అనంతరం శాలావిహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, అగ్నిమధనం తదితర పూజలు నిర్వహించారు. ఈఓ ఆధ్వర్యంలో పర్యవేక్షకులు రా«ధాకృష్ణ, సాయిరామ్, శివ, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది ఏర్పాట్లును పర్యవేక్షించారు. గురువారం ఉదయం సుప్రభాత సేవ, విష్వక్సేనపూజ, పుణ్యహవచనం, సప్తకలశారాధన, సాయంత్రం నాలుగు గంటలకు హంస, సింహ వాహనసేవ, స్వస్తి వచనం, నిత్యహోమాలు, రాత్రి ఏడు గంటలకు స్వామి కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఈఓ వివరించారు.