Brand mixing
-
ఇక్కడా బ్రాండ్ మిక్సింగ్?
విజయనగరం: తూర్పు గోదావరికి చెందిన మధ్యవర్తి ద్వారా అనంతపురానికి చెందిన బడా వ్యాపారి జిల్లాకు గోవా మద్యం దిగుమతి చేసిన వ్యవహారం ఏడాదిన్నర క్రితం వెలుగులోకి వచ్చింది. గోవా మద్యం బయట కనబడకుండా బావిలో దాచిన భాగోతం జామి, కొత్తవలస మండలాల్లోని పలుచోట్ల బయటపడింది. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్టు చేశారు. కేసును లోతుగా విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని కూడా నియమించారు. దీంతో గోవా మద్యం దిగుమతికి కాసింత అడ్డుకట్ట పడింది. కొన్ని నెలలుగా ఒడిశా మద్యం జిల్లాకు దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ప్రభుత్వమిస్తున్న మార్జిన్ ఎటూ చాలలేదన్న ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఒడిశా మద్యాన్ని గుట్టుగా జిల్లాకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఒడిశాలో తక్కువకే మద్యం మన రేటు కన్న ఒడిశాలో 20శాతం తక్కువకు వస్తుండటంతో అక్కడి నుంచి దిగుమతి చేస్తున్నారు. రాయఘడ, గుణుపూర్, సుంకి మీదుగా తీసుకొచ్చే సరకును పార్వతీపురానికి చెందిన కొందరు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల శివారు కాలనీల్లో నిల్వ చేస్తున్నట్టు తెలిసింది. ఇక్కడి నుంచే అనకాపల్లి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు లారీల ద్వారా తరలిస్తున్నట్టు సమాచారం. అక్కడినుంచి వచ్చే మద్యాన్ని మన ప్రాంతానికి చెందిన మద్యంతో కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా వెళ్లాల్సిన ఆదాయానికి గండి పడుతున్నది. మిక్సింగ్‌పై ఫిర్యాదులున్నాయి ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ విజయనగరం డివిజన్ సూపరింటెండెంట్ ఎ.శంభుప్రసాద్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా బ్రాండ్ మిక్సింగ్ జరుగుతున్నట్టు తమకు ఫిర్యాదులు ఉన్నాయన్నారు. కాకపోతే, తాము నిర్వహించిన దాడుల్లో ఎక్కడా దొరకలేదన్నారు. శుక్రవారం కూడా 207మద్యం దుకాణాలు, 28బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేశామన్నారు. కానీ ఎక్కడా బయటపడలేదన్నారు. ప్రస్తుతం బ్రాండ్ మిక్సింగ్ ఒకవైపు ఒడిశా మద్యాన్ని వాడుతున్నారు. మరోవైపు ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపడుతున్నారు. ఇది చాలదన్నట్టు కొందరు బ్రాండ్ మిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. ప్రీమియర్ బ్రాండ్ మద్యంలో రూ. 40 చీప్ లిక్కర్ కల్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది. విజయనగరం, పార్వతీపురంలో గల పలు బార్ అండ్ రెస్టారెంట్లలోనూ, గ్రామీణ ప్రాంతంలో విచ్చల విడిగా నడుస్తున్న బెల్ట్‌షాపుల్లో ఈ కల్తీ బాగోతం కొనసాగుతోంది. బ్రాండెడ్ మద్యం బాటిళ్ల మూతలు తీసేసి, చీప్ లిక్కర్‌ను కలిపిన తర్వాత అనుమానం రాకుండా మళ్లీ కొత్త మూతలు అమర్చుతున్నట్టు తెలిసింది. ఆ మూతలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది అంతుచిక్కడంలేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకరిద్దరు కింద స్థాయి అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినా వాటి జోలికెళ్లొద్దని హెచ్చరించినట్టు తెలుస్తోంది. -
రాష్ట్రంలో మరో కల్తీ మద్యం కుంభకోణం
* బ్రాండ్ మిక్సింగ్‌కు మద్యం మాఫియా సరికొత్త రూటు * కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా మద్యం బాటిళ్ల మూతల సరఫరా * శ్రీకాకుళంజిల్లాలో తీగ లాగితే కదిలిన కల్తీ మద్యం డొంక * ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ అదుపులోకి మూతల సరఫరా దారులు, కేశినేని ట్రావెల్స్ నిర్వాహకులు సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో తీగ లాగితే మరో భారీ కల్తీ మద్యం కుంభకోణం డొంక కదిలింది. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం మూతల్ని ట్యాపింగ్ చేసిన వందల బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో గుర్తించారు. వెంటనే ఎన్ఫోర్సుమెంట్ డైరక్టర్ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ చేయాలని డైరక్టర్ ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ఎన్ఫోర్సుమెంట్ విభాగం హైదరాబాద్‌లోని నాచారంలో కేశినేని కార్గో సర్వీసు కేంద్రంగా బాటిళ్ల మూతలు పార్శిల్ చేస్తున్నారని తేల్చారు. వెంటనే నాచారంలోని కేశినేని కార్గో సర్వీస్ కార్యాలయంలో ఎన్ఫోర్సుమెంట్ అధికారులు గురువారం తనిఖీలు చేసి మద్యం బాటిళ్ల మూతల బాక్సులు కనుగొన్నారు. అన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన మూతల్ని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు పార్శిల్ చేస్తున్నట్లు తేల్చారు. కేశినేని ట్రావెల్స్ నిర్వాహకుల్ని ప్రశ్నించి మూతల్ని సరఫరా చేస్తున్న సరఫరాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఎంత కాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్‌కు మూతలు సరఫరా చేస్తున్నారో.. ఏ ఏ జిల్లాలకు సరఫరా చేశారో.. ఇందులో కేశినేని కార్గో సర్వీసు పాత్ర ఎంతో నిర్ధారించే పనిలో ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంట్ విభాగం ఉంది. బ్రాండ్ మిక్సింగ్ అంటే? బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యుషన్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసేసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు. ఇలాంటివాటిపై ఎక్సైజ్ అధికారులు విధిగా తనిఖీ చేయాలి. అయితే బ్రాండ్ మిక్సింగ్‌ను తేల్చి చెప్పే సాధనాలు ఏవీ ఎక్సైజ్ శాఖ వద్ద లేవు. అనుమానమున్న మద్యం బాటిళ్లను ఎక్సైజ్ ల్యాబొరేటరీలకు పంపాలి. రాష్ట్రంలో ప్రయోగశాలలున్నా అవి అలంకార ప్రాయమయ్యాయి. బెల్టుషాపుల ద్వారా విక్రయాలు.. మద్యం మాఫియా సరికొత్త రూటును ఎంచుకుని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై టాపింగ్ చేసి బెల్టు షాపుల ద్వారా విక్రయాలు చేస్తున్నారు. మద్యం డైల్యుషన్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. డైల్యుషన్ మద్యం సేవించి పలు జిల్లాల్లో మందుబాబులు మరణిస్తున్నారు. ఇటీవలే గుంటూ రు, అనంతపురం జిల్లాల్లో డైల్యుషన్ మద్యం తాగి పలువురు మత్యువాత పడ్డారు. ఇలా పలు ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం నియంత్రణ దిశగా చర్యలు చేపట్టడం లేదు.