ఇండియన్స్ మెచ్చే బ్రాండ్ ఏంటో తెలుసా...
కోల్ కతా: కొరియా స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం శాంసంగ్ భారతీయులు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే ఫోన్ అని టీఆర్ఏ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. దేశంలో వినియోగదారులు నమ్మే అన్ని కంపెనీలలోకెల్లా మొబైల్ కంపెనీ శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఎక్కువ మంది వినియోగదారులు శాంసంగ్ మొబైల్స్ నే నమ్ముతారని, ఆ తర్వాత సోనీ, ఎల్జీ, నోకియా, టాటా మొబైల్స్ కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. 'బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ఆఫ్ ఇండియా సర్వే స్టడీ 2016' లో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
తొలి ఐదు స్థానాలు మొబైల్స్ బ్రాండ్ కంపెనీలు చోటు దక్కించుకోవడం విశేషం. ఆరో స్థానంలో హోండా కంపెనీ, ఏడో స్థానంలో బజాజ్, ల్యాప్ టాప్ తయారీ సంస్థ డెల్ ఎనిమిదో స్థానంలో నిలవగా గోద్రెజ్ తొమ్మిదో స్థానం సంపాదించి టాప్ టెన్ బ్రాండ్లలో నిలిచింది. దేశవ్యాప్తంగా 16 నగరాలలో 267 రకాల బ్రాండ్ ప్రొడక్ట్స్ పై సర్వే చేసి ఈ వివరాలు ప్రకటించారు. కింగ్ ఫిషర్ ఎక్కువ మంది మెచ్చే బీర్ బ్రాండ్ కాగా, ఇంటర్నెట్ విభాగంలో గూగుల్ తొలి స్థానంలో నిలిచింది.