ఇక ఒకే కంపెనీ గూటికి... ఆదిత్య బిర్లా అపారెల్ బిజినెస్
భారీ పునర్వ్యవస్థీకరణకు ఓకే...
⇒ బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల వ్యాపారాల విలీనం..
⇒ కొత్త సంస్థ పేరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్
⇒ విలీనంతో ఏర్పాటయ్యే కంపెనీకి రూ. 6,000 కోట్ల టర్నోవర్.. 1,869 రిటైల్ స్టోర్లు..
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ తన బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తులు(అపారెల్) వ్యాపారాలన్నింటినీ విలీనం చేసి ఒకే సంస్థగా ఏర్పాటు చేసేవిధంగా భారీ పునర్వ్యవస్థీకరణకు తెరతీసింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగే ఈ డీల్‌కు ఆయా కంపెనీల బోర్డులు ఆమోదం తెలిపాయి.
దీని ప్రకారం గ్రూప్ హోల్డింగ్ కంపెనీ ఆదిత్య బిర్లా నువో(ఏబీఎన్‌ఎల్)కు చెందిన దుస్తుల వ్యాపారాలతో పాటు గ్రూప్‌లోని మరో సంస్థ మధుర గార్మెంట్స్ లైఫ్‌స్టైల్ రిటైల్ కంపెనీ(ఎంజీఎల్ఆర్సీఎల్)లను విడదీసి మరో లిస్టెడ్ కంపెనీ అయిన పాంటలూన్ ఫ్యాషన్ అండ్ రిటైల్(పీఎఫ్‌ఆర్‌ఎల్)లో విలీనం చేయనున్నారు. విలీనం అనంతరం దీని పేరు ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్(ఏబీఎఫ్ఆర్ఎల్)గా మారుతుంది.
కొత్తగా ఏర్పాటైన సంస్థకు దేశవ్యాప్తంగా 1,869 ఎక్స్‌క్లూజివ్ రిటైల్ స్టోర్లు.. అదేవిధంగా రూ.6,000 కోట్ల మేర ఆదాయం ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ‘మధుర గార్మెంట్స్, ఏబీఎన్‌ఎల్ రెడీమేడ్ వ్యాపారాలు, పాంటలూన్స్ను విలీనం చేయడం ద్వారా ఏర్పాటవుతున్న కొత్త సంస్థ..కూడా అతిపెద్దదిగా అవతరించనుంది. అంతేకాదు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రంగంలో భారత్‌లోనే టాప్ కంపెనీగా కూడా నిలవనుంది. వాటాదారులకు కూడా దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది’ అని గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. ఈ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ప్రకారం.. ఏబీఎన్‌ఎల్ వాటాదారులకు ఏబీఎఫ్ఆర్ఎల్లో ప్రత్యక్షంగా షేర్‌హోల్డింగ్ లభిస్తుందన్నారు.
షేర్ల కేటాయింపు ఇలా...
మధుర ఫ్యాషన్స్‌ను విడదీస్తున్న కారణంగా(డీమెర్జర్) ఏబీఎన్ఎల్లో వాటాదారుల ప్రతి 5 షేర్లకుగాను పీఎఫ్ఆర్ఎల్లో 26 కొత్త షేర్లు లభిస్తాయి. ఇక మధుర లైఫ్‌స్టైల్ డీమెర్జర్ నేపథ్యంలో ఎంజీఎల్ఆర్సీఎల్లో ప్రతి 500 షేర్లకుగాను 7 పీఎఫ్‌ఆర్‌ఎల్ షేర్లు దక్కుతాయి. ఎంజీఎల్ఆర్సీఎల్ ప్రిఫరెన్స్ షేర్హోల్డర్లకు ఒక్కో కొత్త పీఎఫ్‌ఆర్‌ఎల్ షేరు లభిస్తుంది. కార్పొరేట్ అదేవిధంగా నియంత్రణపరమైన అనుమతులకు లోబడి ఈ మొత్తం లవాదేవీలన్నీ వచ్చే 6-9 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. కాగా, పీఎఫ్ఆర్ఎల్లో ప్రస్తుతం ఉన్న 9.28 కోట్ల ఈక్విటీ షేర్ల పరిమాణం.. ఈ డీల్ పూర్తయ్యాక 77.28 కోట్లకు చేరుతుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
మొత్తంమీద ఆదిత్య బిర్లా నువోలో వాటాదారులకు ప్రతి 100 ఈక్విటీ షేర్లకుగాను 520 అదనపు పీఎఫ్ఆర్ షేర్లు దక్కుతాయి. కాగా, కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ప్యాంటలూన్ రిటైల్‌లో మెజారిటీ వాటాను 2012లో ఆదిత్య బిర్లా గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్‌కు వాన్ హూసెన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లండ్, లూయీస్ ఫిలిప్, పీపుల్ వంటి ప్రఖ్యాత రెడీమేడ్ దుస్తుల బ్రాండ్లు ఉన్నాయి.
ప్రస్తుతం పీఎఫ్‌ఆర్‌ఎల్ షేరు ధర(గురువారం ముగింపు) బీఎస్ఈలో రూ.113.90 వద్ద ఉంది. ఈ షేరు ముఖ విలువ రూ.10 కాగా.. మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ.1,057 కోట్లు.