ట్రాఫిక్ ఎస్సై ధైర్యసాహసాలు.. ప్రశంసలు!
సాక్షి, విజయవాడ: ఓ ట్రాపిక్ ఎస్సై ధైర్యసాహసాలు ప్రదర్శించి.. చురుగ్గా స్పందించి ఓ మహిళ ప్రాణాలను కాపాడాడు. కృష్ణలంక సమీపంలోని బందరు కాల్వలో ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. కాల్వలో కొట్టుకుపోతున్న ఆమెను గుర్తించి స్థానికులు కేకలు వేశారు. కాపాడాలని అర్థించారు. అటుగా వెళుతున్న ట్రాఫిక్ ఎస్సై అర్జునరావు దీనిని గుర్తించారు. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను చూసి వెనుకాముందు ఆలోచించకుండా కాల్వలోకి దూకేశారు. ఈదుకుంటూ వెళ్లి మహిళను ఓడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. దీంతో మహిళ ప్రాణాలతో బయటపడింది.
సమయానుకూలంగా ధైర్యసాహసాలతో వ్యవహరించి.. కాల్వలో కొట్టుకుపోతున్న మహిళను కాపాడిన ట్రాఫిక్ ఎస్సై అర్జునరావుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆయన సాహసాన్ని డీజీపీ గౌతం సవాంగ్ ప్రత్యేకంగా కొనియాడారు. మహిళను కాపాడడమే కాకుండా ప్రాధమిక చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన ఎస్సై అర్జునరావుకు అభినందనలు తెలిపారు. ఆయన పేరును ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు.