BRBNMPL
-
నోట్ల తయారీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
ముంబై: నోట్ల తయారీలో సమీప కాలంలో భారత్ 100 శాతం స్వయం సమృద్ధిని సాధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. మైసూరులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంపీఎల్) ఏర్పాటు చేసిన ఇంక్ తయారీ యూనిట్– ‘వర్ణిక’ను జాతికి అంకితం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, ఈ యూనిట్‌తో నోట్ల తయారీ వ్యవస్థలో భారత్ గణనీయమైన పురోగతి సాధించినట్లైందన్నారు. దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి గణనీయంగా తగ్గనుందని తెలిపారు. సమీప భవిష్యత్తులో నోట్ల తయారీలో 100 శాతం స్వయం సమృద్ధిని సాధించేందుకు నిరంతర (సుశిక్షత మానవ వనరులు, ప్రక్రియ, సాంకేతికత, సామర్థ్యం పరంగా) పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. ఎల్డీసీకి శంకుస్థాపన... కాగా, బీఆర్బీఎన్ఎంపీఎల్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ (ఎల్డీసీ)కు కూడా గవర్నర్ శక్తికాంత దాస్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, దేశంలోని కరెన్సీ ఉత్పత్తి, ఈ విభాగంలో మానవ వనరుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఎల్డీసీ ఏర్పాటు ఎంతో కీలకమవుతుందని అన్నారు. ఈ కేంద్రం గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఆవిర్భవించనుందని కూడా తెలిపారు. వర్ణిక ప్రత్యేకతలు... ఆర్బీఐ నియంత్రణలోని బీఆర్బీఎన్ఎంపీఎల్ నోట్ల భద్రతను మెరుగుపరచడానికి ఉద్దేశించి వర్ణికాను ఏర్పాటు చేసింది. ఈ యూనిట్ వార్షిక ఇంక్ తయారీ సామర్థ్యం 1,500 మెట్రిక్ టన్నులు. కలర్ షిఫ్ట్ ఇంటాగ్లియో ఇంక్ (సీఎస్ఐఐ)ని కూడా వర్ణిక తయారు చేస్తుంది. భారతదేశంలోని బ్యాంక్ నోట్ ప్రింటింగ్ ప్రెస్‌ల పూర్తి అవసరాలను తీరుస్తుంది. దీని ఫలితంగా బ్యాంక్ నోట్ ఇంక్ ఉత్పత్తిలో వ్యయాలు తగ్గుతాయి. సామర్థ్యం మెరుగుపడుతుంది. తద్వారా ఈ విషయంలో దేశం ఎంతో స్వయం సమృద్ధి సాధించినట్లయ్యింది. ఈ యూనిట్ ఏర్పాటు ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవకు ఊతమిస్తోందని, నోట్ల ప్రింటింగ్ ఇంక్‌ను అవసరమైన పరిమాణంలో దేశీయంగానే ఉత్పత్తి చేయడానికి ఈ యూనిట్ ఊతం ఇస్తుందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
గత ఆగస్టులోనే రూ. 2 వేల నోట్ల ముద్రణ
ఇండోర్: నోట్ల రద్దు నిర్ణయానికి రెండున్నర నెలల ముందుగానే రూ.2 వేల నోట్ల ముద్రణ ప్రారంభమైందని ఆర్బీఐకు అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్(బీఆర్ బీఎన్ ఎంపీఎల్) వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ గౌడ్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానం ఇచ్చింది. రూ.2 వేల నోట్ల ముద్రణ 2016 ఆగస్టు 22న, రూ. 500 నోట్ల ముద్రణ నవంబర్ 23న ప్రారంభించామని తెలిపింది. పాత 500 రూపాయల నోట్లను గతేడాది 27 నుంచి ప్రింట్ చేయడం మానేసినట్టు తెలిపింది. వెయ్యి రూపాయల నోట్ల ముద్రణను జూలై 28 నుంచే ఆపేసినట్టు వెల్లడించింది. -
భారీ మొత్తంలో కరెన్సీ పేపర్ దిగుమతి!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త కరెన్సీ నోట్లను భారీ సంఖ్యలో ముద్రించాల్సి వస్తోంది. డిమాండ్ కు అనుగుణంగా కొత్త నోట్లు ప్రింట్ చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రయత్నిస్తోంది. నోట్లు ముద్రించడానికి అవసరమయ్యే కరెన్సీ పేపర్ ను ఆర్బీఐ తయారు చేస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు ఎక్కువగా ముద్రించాల్సి రావడంతో అదనంగా 8 వేల టన్నుల కరెన్సీ పేపర్ ను త్వరలోనే దిగుమతి చేసుకోవాలని ఆర్బీఐ భావిస్తోంది. గత కొన్నేళ్లుగా నోట్ల ముద్రణకు ఏడాదికి 25 వేల టన్నుల పేపర్ వాడుతున్నారు. ఆర్బీఐ నోట్ ముద్రణ్ ప్రైవేటు లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్) 18 వేల టన్నుల వరకు పేపరు తయారు చేస్తోంది. మామూలుగా అయితే ఆర్బీఐ దగ్గరున్న పేపర్ వచ్చే ఏడాది సగం వరకు సరిపోయేది. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు అధికంగా ప్రింట్ చేయాల్సి రావడంతో అదనంగా బ్యాంకు నోటు పేపర్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ,బీఆర్బీఎన్ఎంపీఎల్ అధికార వర్గాలు వెల్లడించాయి. 20 వేల టన్నుల పేపర్ దిగుమతి చేసుకోవాలను కుంటున్నట్టు తెలిపాయి. అంతకుముందుతో పోలిస్తే ఇది 8 టన్నుల అదనమని, గతంలో ఇంతకంటే పెద్ద మొత్తంలో పేపర్ దిగుమతి చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాయి. ఇప్పుడు చాలా వరకు మనమే తయారు చేసుకుంటున్నామని వివరించాయి. కరెన్సీ పేపర్ సరఫరా ఆర్డర్ కోసం 9 విదేశీ కంపెనీల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఆరు కంపెనీలు ఇప్పటికే మనదేశానికి కరెన్సీ పేపర్ ఎగుమతి చేస్తున్నాయి. -
ఎన్ని నోట్లు రెడీ అవుతున్నాయో తెలుసా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దుతో ప్రత్నామ్నాయ నగదును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు మూడు ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా రోజుకి మిలియన్ల కొద్దీ కరెన్సీని ముద్రిస్తోంది. తద్వారా తగినంత కరెన్సీ నోట్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ప్రధానంగా బీఆర్బీఎన్ఎంపీఎల్ (భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రయివేట్ లిమిటెడ్ ) ద్వారా (18లైన్లు) సుమారు 4కోట్లు( 40 మిలియన్ల)రూ.2 వేల నోట్లను ముద్రిస్తోంది. అలాగే బీఎన్పీ దివస్ (బ్యాంక్ నోట్ ప్రెస్ ప్రింటింగ్ ప్రెస్ (3లైన్లు) లో 90 లక్షల రూ.500 నోట్లను రడీ చేస్తున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అలాగే నాసిక్ ప్రెస్ లోని నాలుగు లైన్ల ద్వారా సుమారు కోటి 80 లక్షల( (18మిలియన్లు) కరెన్సీ నోట్లను ముదిస్తున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నాసిక్ లోని ప్రెస్ (1లైన్) ద్వారా రోజుకు ముఖ్యంగా 50 లక్షల రూ. 20 రూపాయల నోట్ల ను ముద్రిస్తోంది. అలాగే (2లైన్లు) కోటి(10 మిలియన్ల) రూ.100 నోట్లును ముద్రిస్తోంది. తగినంత కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భరోసా ఇచ్చింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత వరుసగా తొమ్మిదో రోజుకూడా ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. అటు రద్దుచేసిన రూ. 500, రూ.1000 నోట్ల మార్పిడి పరిమితిని గురువారం రూ2వేలకు కుదించింది ప్రభుత్వం. మరోవైపు పార్లమెంట్ లో ప్రతిపక్షాల నిరసనల సెగ రేగిన సంగతి తెలిసిందే.