భారీ మొత్తంలో కరెన్సీ పేపర్ దిగుమతి!
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త కరెన్సీ నోట్లను భారీ సంఖ్యలో ముద్రించాల్సి వస్తోంది. డిమాండ్ కు అనుగుణంగా కొత్త నోట్లు ప్రింట్ చేసేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రయత్నిస్తోంది. నోట్లు ముద్రించడానికి అవసరమయ్యే కరెన్సీ పేపర్ ను ఆర్బీఐ తయారు చేస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు ఎక్కువగా ముద్రించాల్సి రావడంతో అదనంగా 8 వేల టన్నుల కరెన్సీ పేపర్ ను త్వరలోనే దిగుమతి చేసుకోవాలని ఆర్బీఐ భావిస్తోంది.
గత కొన్నేళ్లుగా నోట్ల ముద్రణకు ఏడాదికి 25 వేల టన్నుల పేపర్ వాడుతున్నారు. ఆర్బీఐ నోట్ ముద్రణ్ ప్రైవేటు లిమిటెడ్(బీఆర్బీఎన్ఎంపీఎల్) 18 వేల టన్నుల వరకు పేపరు తయారు చేస్తోంది. మామూలుగా అయితే ఆర్బీఐ దగ్గరున్న పేపర్ వచ్చే ఏడాది సగం వరకు సరిపోయేది. నోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు అధికంగా ప్రింట్ చేయాల్సి రావడంతో అదనంగా బ్యాంకు నోటు పేపర్ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర ఆర్థిక శాఖ,బీఆర్బీఎన్ఎంపీఎల్ అధికార వర్గాలు వెల్లడించాయి. 20 వేల టన్నుల పేపర్ దిగుమతి చేసుకోవాలను కుంటున్నట్టు తెలిపాయి. అంతకుముందుతో పోలిస్తే ఇది 8 టన్నుల అదనమని, గతంలో ఇంతకంటే పెద్ద మొత్తంలో పేపర్ దిగుమతి చేసుకున్న విషయాన్ని గుర్తు చేశాయి. ఇప్పుడు చాలా వరకు మనమే తయారు చేసుకుంటున్నామని వివరించాయి.
కరెన్సీ పేపర్ సరఫరా ఆర్డర్ కోసం 9 విదేశీ కంపెనీల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఆరు కంపెనీలు ఇప్పటికే మనదేశానికి కరెన్సీ పేపర్ ఎగుమతి చేస్తున్నాయి.