జీవాల పెంపకంతో అభివృద్ధి
ఆదిలాబాద్ రూరల్ : నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమంలో రుణాలను అందజేస్తుంది. ప్రభుత్వం గతంలో గ్రామాల్లో పీవోపీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేల్లో అత్యంత నిరుపేదలు ఉన్న వారిని ర్యాంక్ వారీగా ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగానే నియోజకవర్గంలోని ఆదిలాబాద్, బేల, జైనథ్ మండలలో బేల మండలం 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఎంపికైంది. ఆదిలాబాద్, జైనథ్ మండలాలు ఈ ఆర్థిక సంవత్సరంలో పల్లె ప్రగతి కాని మండలాల కింద ఎంపిక చేసి రుణాలు అందిచనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
దీని కోసం అధికారులు నివేధికలను సిద్ధం చేస్తున్నారు. ఇదీలా ఉండగా మహిళల్లో చైతన్యం తీసుకువచ్చి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రుణాలు అందజేస్తూ ఆర్థిక బలోపేతానికి జీవాల పెంపకం, బట్టల, కిరణా షాపులు, చిప్పుర్ల తయారీ ద్వారా చేయూత అందజేస్తోంది. వంటింటికే పరిమితమవుతున్న మహిళలు పలు రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి పేదరిక నిర్మూలన సంస్థ పల్లె ప్రగతి పథకంలో భాగంగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలోని బేల మండలంలోని వివిధ గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 200 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు గొర్రెలు, మేకలు కొనుగోళుకు, జనరల్ స్టోర్, కిరణా షాప్ ఏర్పాటు కోసం రుణాలు అందించింది. ఒక్కొక్క సభ్యురాలికి రూ. 30 నుంచి 50 వేలు రుణం అందజేసి వారు ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందాలి, వచ్చిన ఆదాయంతో రుణాల చెల్లింపు ఎలా చేయాలి అనే వాటిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వచ్చిన ఆదాయంతో అప్పులు చెల్లిస్తూ ప్రగతి పథంలో పయనిస్తున్నారు.
లాభలు ఇలా...
మేకలు, గొర్రెలు రోజువారీ పనులకు ఆటంకం కాకుండా ఓ కాపరిని ఏర్పాటు చేయడంలో లేదా ఇంట్లో ఖాళీగా ఉన్న ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించిన్నట్లు అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తము ఇతర కూలీ పనులకు వెళ్తు వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ భారం కూడా లేకుండా ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఏడాది కిందట జీవాలను పంపిణీ చేయడంతో జీవాల పిల్లల సంఖ్య పెరగడంతో రెండింతల మేరకు ఆదాయం సమకురుతుందని సభ్యులు తెలుపుతున్నారు.
లాభలు వస్తున్నాయి
- మెస్రం లక్ష్మీ, చెప్రాల, బేల
స్త్రీనిధి అప్పుతో గత ఏడాది మేకలను కొనుగోలు చేశాను. అవి ప్రస్తుతం రెట్టింపు అయ్యాయి. దీంతో రుణం చెల్లించడం కూడా సులభంగా ఉంది. కాని ప్రభుత్వం స్పందించి మేకలకు ఉచిత మందులు సరఫరా చేస్తే బాగుంటుంది.
నెలనెలా అప్పు సక్రమంగా చెల్లిస్తున్నాం
- అరుణ, బేల
స్త్రీ నిధి పథకం ద్వారా రూ. 50వేలు అందజేశారు. దాని ద్వారా మండల కేంద్రంలో జనరల్ స్టోర్ ఏర్పాటు చేసుకున్నాను. తన కూలీ గిట్టుబాటు కావడంతో పాటు కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడుతుంది. రుణం కూడా సకాలంలో చెల్లించడానికి సులువుగా ఉంది.
సత్ఫలితాలిస్తున్న జీవాల పెంపకం
- జ్ఞాను, ఏపీఎం, బేల
మండలంలో జీవాల పెంపకం సత్ఫలితాలిస్తుంది. మండలంలోని సుమారు 200 మందికి వివిధ గ్రామాల్లో వివిధ స్త్రీ నిధి కింద రుణాలను అందజేశాం. జీవాల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి పోషణ చేస్తుండడంతో రెండింత ఆదాయం పొందుతున్నారు. ఇతర వ్యాపారులు పెట్టుకున్న వారికి కూడా లాభం చేకూరుతుంది.