bribes for officer
-
ఆగని అక్రమాలు..
సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేసినా.. ప్రైవేట్ వ్యక్తులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా, కార్యాలయాల సమయంలోనే విధులను నిర్వహించాలని చెప్పినా.. లంచాలు వసూలు చేయొద్దని ఆదేశించినా..అధికారుల తీరు మారడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఇదే అదనుగా కార్యాలయాల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్ల పెత్తనం పెచ్చుమీరి పోతోంది. వీరికి సబ్‌రిజిస్ట్రార్లతోపాటు అందులో పనిచేసే సిబ్బంది వారు నియమించుకున్న ప్రైవేట్ సిబ్బంది పూర్తి అండదండలు అందిస్తున్నారనేది బహిరంగ సత్యం. ‘ఏసీబీ’ తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు.. భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో రిజిస్ట్రేషన్ల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. వందలాది డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్ వద్ద పెండింగ్‌లో ఉండడం ఇక్కడ కొసమెరుపు. రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేస్తూ బీబీనగర్ అధికారుల ఉదాంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు ఆక్రమించిన బినామీ భూములను జిరాక్స్ కాపీలతో రిజిస్ట్రేషన్ చేస్తూ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లారు. ఇలా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అడ్డూఅదుపు లేకుండా అక్రమాల పర్వం జోరుగా సాగుతోంది. పలు కార్యాలయాల్లో అక్రమాల జాతరే.. భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూర్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాల జాతర కొనసాగుతోంది. ఆయా కార్యాలయాల చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. వీటిని తొలగించే ప్రయత్నం ఎవరివల్ల కావడం లేదు. ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళ్లగానే అధికారులు వెంటనే డాక్యుమెంట్ రైటర్ల వద్దకు పంపిస్తారు. వారి వద్ద నుంచే డాక్యుమెంట్లు, చలాన్లు చెల్లిస్తారు. భూమికి ఉన్న విలువను బట్టి ప్లాటు, ఎకరాల్లో రిజిస్ట్రేషన్లకు వంతుల వారీగా డబ్బులు నిర్ణయించి రైటర్లే వసూలు చేస్తారు. ఇక్కడ అంతా రైటర్లదే హవా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారి వద్ద డాక్యుమెంట్ల వారిగా రేట్లు నిర్ణయిస్తారు. సమస్యాత్మక భూములుంటే.. సమస్యాత్మక భూములు ఉంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాదని పక్కన పెట్టేస్తారు. రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. సామాన్యుడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు. లంచం ఇవ్వకపోతే అన్ని సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. సమస్యలు లేకున్నా సృష్టించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. అయితే జిరాక్స్ కాపీలపై తప్పుడు ధ్రువపత్రాలు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోడాక్యుమెంట్ రైటర్లకు డబ్బులు ముట్టిన వెంటనే రిజిస్ట్రేషన్ తతంగం అంతా పూర్తి చేస్తారు. ఏరోజుకారోజు వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా సాయంత్రం అధికారులు, ఉద్యోగులు లె క్కలు చూసుకుని వాటాలు పంచుకుని ఇంటికి వెళ్తారు. కార్యాలయాల చుట్టూ అద్దె భవనాలు.. భువనగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అలాగే యాదగిరిగుట్టలో కొనసాగుతున్న కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాలు విచ్చలవిడిగా వెలిశాయి. జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్ రైటర్లు గదులను అద్దెకు తీసుకుని పాగా వేశారు. కొన్నిచోట్ల ఇతరులకు అద్దె భవనాలు దొరక్కకుండా డాక్యుమెంట్ రైటర్లే కార్యాలయాల చుట్టుపక్కల గల భవనాలకు అద్దెలు చెల్లిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. రికార్డులు పంపించరు.. నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే ఆ డాక్యుమెంట్ల రికార్డులను స్కానింగ్ చేసి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి నేరుగా యజమానికి చేరవేయాలి. కానీ ప్రతి చోట అలా జరగడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు తాము చేయించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకుని తమ వద్దే ఉంచుకుని పంపిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. బీబీనగర్‌లో రాత్రి పొద్దుపోయే వరకు.. బీబీనగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడురోజుల క్రితం రాత్రి 10గంటలు దాటిన రిజిస్ట్రేషన్ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు ఉండడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులను రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి విధి నిర్వహణ కోసం రానీయవద్దని ఇటీవల ఆశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ వ్యక్తులు డాక్యుమెంటర్ల అనుచరులు ఏసీబీకి పట్టుబడ్డారు. పలు అవకతవకలకు కారణం అవుతున్న ప్రైవేట్ సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో కార్యాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే విధి నిర్వహణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్ కొనసాగడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలేనని ఆరోపణలు ఉన్నా యి. అయితే మధ్యాహ్నం సర్వర్ పని చేయకపోవడం వల్లే అనుమతి తీసుకుని పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేశామని అధికారులు సంజాయిషీ ఇస్తున్నారు. తారస్థాయికి చేరిన అవినీతి.. భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, యాదగిరిగుట్ట, మోత్కూర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయిలో కొనసాగుతోంది. జిల్లాలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లాట్లు, భూములు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో రియల్టర్లు తొందరగా పని పూర్తి చేయడం, కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు, సమస్యాత్మక భూములు రిజిస్ట్రేషన్లు చేయించడం కోసం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజేబుతున్నారు. యాదగిరిగుట్టలో.. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన తరువాత ఇక్కడ పని చేసిన సబ్ రిజిస్ట్రార్ వాహిద్‌ను నల్లగొండకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హుజూర్నగర్ నుంచి సైదులును ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన తరువాత హైదరాబాద్ నుంచి జహంగీర్ వచ్చారు. ఆయన్ని కూడా మార్చి ప్రస్తుతం దేవరకొండ నుంచి శ్రీనివాస్‌రావును సబ్ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు ముగ్గురు అధికారులను బదిలీ చేశారు. ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో జిల్లా రిజిస్ట్రార్, ఆడిట్ డీఆర్లు తనిఖీలు చేశారు. అన్ని సక్రమంగా ఉన్నా.. పైచిత్రం యాదగిరిగుట్టలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఇటీవల రాజాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, భూమిని భాగాలుగా విభజించుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇక్కడకి వచ్చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న డాక్యుమెంట్ రైటర్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుతోపాటు అదనంగా మరో రూ.20వేలు అధికారులకు చెల్లించాలని తెలిపారు. దీంతో సదరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయి కదా ఎందుకు చెల్లించాలని అడగ్గా తనకేమీ తెలియదని అంతా రిజిస్ట్రార్ ఆదేశాల మేరకు జరుగుతుందని సదరు రైటర్ సెలవిచ్చారు. అయితే అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండానే అక్కడనుంచి వెనుదిరిగిపోయారు. యాదగిరి గుట్టలో ఒక్కచోటే కాదు జిల్లాలోని ప్రతి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ ఇదే తతంగం కొనసాగుతోంది. -
తహసీల్దార్ కార్యాలయాల్లో దళారీల దందా!
ప్రభుత్వ శాఖలన్నింటిలో ఎక్కువ అవినీతి రెవెన్యూ విభాగంలో ఉందని ప్రభుత్వం నిర్వహించిన సర్వేలు తేటతెల్లం చేశాయి. అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపాలని మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేసినా అవినీతి రుచిమరిగిన అధికారులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఏదైనా ధ్రువ పత్రం కోసం సరైన రికార్డులతో మీసేవలో దరఖాస్తు చేసుకుంటే కొద్ది రోజుల్లో సర్టిఫికెట్ వస్తుందని పాలకులు గొప్పలు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయంలో చేయి తడిపితే పని వేగంగా పూర్తవుతుంది. లేదంటే దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. కర్నూలు(అగ్రికల్చర్): మీసేవ కేంద్రాలు అందుబాటులోకి వచ్చినా ధ్రువ పత్రాల కోసం లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎటవంటి సర్టిఫికెట్ కావాలన్నా మీసేవ కేంద్రంలో తగిన పత్రాలు సమర్పించి ఆన్లైన్లో అప్లోడ్ చేయిస్తే నిర్ణీత గడువు తర్వాత మీసేవ కేంద్రం నుంచి సర్టిఫికెట్ పొందవచ్చనేది నిబంధన. అయితే ఇది ఎక్కడా అమలు కావడం లేదు. పలువురు తహసీల్దార్లు దళారీలను, ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. విచారణ జరిపి ఇవ్వాల్సిన వాటికి మాత్రం అడిగినంత ఇచ్చుకోక తప్పని పరిస్థితి. రెవెన్యూలో అడ్డగోలు వసూళ్లు.... మీసేవ కేంద్రాల్లో రెవెన్యూశాఖకు చెందినవే 70 వరకు సేవలు ఉన్నాయి. మ్యుటేషన్ కమ్ ప్యామిలి ఈ–పాసు పుస్తకం, ల్యాండ్ కన్వర్షన్, ఈబీసీ, ఓబీసీ సర్టిపికెట్లు, వ్యవసాయ ఆదాయపు ధ్రువపత్రం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తదితర వాటి కోసం వీటిల్లో తగిన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయాలి. తహసీల్దారు వాటిపై వీఆర్ఓ, ఆర్ఐ ద్వారా విచారణ జరిపించి అన్ని సక్రమంగా ఉంటే నిర్ణీత గడువులోపు ఆమోదించి డిజిటల్ సిగ్నేచర్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇలా దాదాపు ఏ మండలంలో అమలు కావడం లేదు. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సర్టిఫికెట్ రాదని తహసీల్దార్లే పరోక్షంగా చెబుతున్నారు. మామూళ్లు ముట్టచెప్పకపోవడంతో తిరస్కరణకు గురవుతున్న దరఖాస్తులు అన్ని మండలాల్లో భారీగానే ఉంటున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడం గగనమే.. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ పొందడం అతి కష్టంగా మారింది. కుటుంబ యజమాని మరణించినపుడు ఆయన భార్యకు వారసత్వ ( ఫ్యామిలీ మెంబర్) సర్టిఫికెట్ అవసరం. అన్ని డాక్యుమెంట్లతో మీసేవ కేంద్రంలో చేసుకుంటే 15 రోజుల్లో ఆమోదించాలి. ఇందుకు భిన్నంగా అన్ని స్థాయిల వారికి ముడుపులు ఇచ్చుకుంటేనే పని అవుతుంది. మ్యుటేషన్ కావాలంటే ఇచ్చుకోక తప్పదు... భూములు కొనుగోలు చేసినపుడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిష్టర్ చేసిన తర్వాత రెవెన్యూ రికార్డులు, వెబ్‌ల్యాండ్‌లో మార్పులు చేసుకోవాలి. వీటినే మ్యుటేషన్‌గా వ్యవహరిస్తారు. ఇందుకు మీసేవ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. తహసీల్దార్ కార్యాలయాల్లో ఇచ్చుకున్న వారి మ్యుటేషన్లు చేస్తూ మిగిలిన వాటిని తిరస్కరిస్తున్నారనే విమర్శలున్నాయి. మ్యుటేషన్ కమ్ ఈ–పాసుపుస్తకాలకు 59,500 దరఖాస్తులు మీసేవ కేంద్రాల ద్వారా వచ్చాయి. వీటిని 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంది. ఇందులో 36,000 దరఖాస్తులను మాత్రమే ఆమోదించారు.13,500 తిరస్కరించారు. ముడుపులు ఇవ్వకపోవడం వల్ల తిరస్కరించినవే ఎక్కువ ఉన్నట్లు సమచారం. -
వారికిది ‘డబ్బుల్’ పథకం!
సాక్షి, కొత్తగూడెం : పేదల కోసం ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం పథకాన్ని కొందరు అధికారులు, సిబ్బంది ‘డబ్బులు’ కక్కే పథకంగా మలుచుకుంటున్నారు. అందిన కాడికి లంచాలు పుచ్చుకునేలా అవకాశాలను మార్చుకుంటున్నారు. సర్కారు కేటాయిస్తున్న నిధులతో డబుల్ బెడ్రూం ఇళ్లు కడితే..తమకు మిగిలేది నామమాత్రమేనని, ఇందులో పర్సంటేజీలు ఇచ్చుకుంటూ పోతే..ఇక తాము నష్టపోవాల్సిందేనని కాంట్రాక్టర్లు వాపోతూ..అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తుండడంతో జిల్లాలో ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో..ఈ పథకం వెనకాల నడుస్తున్న అవినీతి బాగోతం వెలుగుజూసింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గిట్టుబాటు కావట్లేదనే ఆలోచనతో కాంట్రాక్టర్లు మొదట్లో ముందుకు రాలేదు. అయినప్పటికీ ఉన్నతాధికారుల కృషి ఫలితంగా కొందరు నిర్మాణాలు చేపట్టారు. చివరకు ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే విషయంలోనూ ఇంజినీరింగ్ అధికారులు భారీగా ముడుపులు అడుగుతున్నారని అనేక ఆరోపణలతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఐటీడీఏలో ఇద్దరు.. భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లో ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్ వద్ద రూ.50వేలు లంచం తీసుకుని ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని జయశంకర్ జిల్లా వెంకటాపురం మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో బిల్లులు ఇవ్వకుండా తిప్పుతుండడంతో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి విసుగు చెందారు. తనకు రూ.55లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉండగా..పర్సంటేజీ రూ.లక్ష ఇవ్వాలని ఏటీడీఏ విభాగం నుంచి డిమాండ్ చేయడంతో..విసుగుచెందిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించి వారి సూచన మేరకు..ముందుగా రూ.50వేలు ఇస్తానని అంగీకరించి ఓ చోట ఇస్తుండగా..ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఐటీడీఏ ఈఈ శంకర్, ఏఈ సత్యనారాయణను అరెస్ట్ చేశారు. గతంలో బూర్గంపాడు డీటీ.. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రతీది తమకు కాసులు కురిపించేలా చేసుకుంటున్నారు కొందరు అధికారులు అనడానికి..బూర్గంపాడులో గతంలో జరిగిన ఓ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. గత అక్టోబరులో బూర్గంపాడు మండలంలో డబుల్ ఇళ్లకు ఇసుక కూపన్లు ఇచ్చేందుకు అప్పటి ఉప తహసీల్దార్ భరణిబాబు కాంట్రాక్టర్ వద్ద రూ.20వేలు డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించడంతో..రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. డబుల్ బెడ్రూం లాంటి పథకాల విషయంలోనూ అధికారులు ముక్కుపిండి లంచాలు వసూలు చేస్తుండడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. విద్యాశాఖలో ఒకరు.. గత జనవరి 29వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కారు. పాల్వంచకు చెందిన శ్రీలక్ష్మి చిల్డ్రన్స్ స్కూల్‌కు రిజిస్ట్రేషన్ గడువు పూర్తి కావడంతో మరో రెండు సంవత్సరాలు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా..డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కట్టంగూరు సైదులు రూ.25వేలు డిమాండ్ చేశాడు. 30 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న తాము అంత ఇవ్వలేమని చెప్పినప్పటికీ వినకపోవడంతో పాఠశాల యజమాని ఏసీబీని ఆశ్రయించారు. జనవరి 29న సదరు పాఠశాల యాజమాన్యం నుంచి రూ.25వేలు తీసుకుంటూ సైదులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. విద్యాశాఖ విషయానికి వస్తే మెడికల్ రీయింబర్స్మెంట్, కస్తూర్బా పాఠశాలల బిల్లులు, ప్రైవేట్ పాఠశాలల విషయంలో ముడుపులు ఇవ్వనిదే పనులు అయ్యే పరిస్థితి లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. -
తవ్వేస్తున్నారు
ప్రభుత్వ భూమిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు అనుమతి ఓ చోట, తవ్వకాలు మరో చోట గడువు పూర్తయినా ఆగని తవ్వకాలు మామూళ్లమత్తులో రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారులు ఒక్కొక్కరికీ ఒక్కో ప్యాకేజీ అక్రమార్కులు కొందరు సహజవనరులను కొల్లగొడుతున్నారు. గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అనుమతి ఓ చోట పొంది, మరోచోట తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి గడువు పూర్తయినా ఆగలేదు. రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ సహజనవనరులను దోచుకుంటున్న వైనంపై కథనం. బుచ్చిరెడ్డిపాళెం : కొడవలూరు మండలంలో గ్రావెల్దందా మితిమీరింది. యల్లాయపాళెం రెవెన్యూ పరిధిలోని రామాపురంలో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. కార్తికేయ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ గ్రావెల్ కావాలని జిల్లా మైన్స్ అండ్ జియాలజీ విభాగాన్ని కోరింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు స్థానిక తహసీల్దార్ ద్వారా పంపింది. వీటిని పరిశీలించిన జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రావెల్ రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 2016 మే 11వ తేదీన మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ మే 12న సర్వే నంబరు 1034లో జె.మల్లికార్జునకు చెందిన 90 సెంట్లు, వి.రమణయ్యకు చెందిన 92 సెంట్లలో 4330 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను రెండు నెలల్లో తీసుకోవాల్సిందిగా అనుమతి ఇచ్చారు. జరుగుతోందిలా... సర్వే నంబరు 1034లో నేటికీ దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. అనుమతికి మించి 50వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. గడువు ముగిసి ఎనిమిది రోజులు దాటుతున్నా నేటికీ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. మానిటరింగ్ చేయాల్సిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలుతోంది. సీలింగ్ భూమిలో తవ్వకాలు సర్వే నంబరు 1034లో 11.16 సెంట్లు సీలింగ్ భూమి ఉంది. ఈ భూమిని యల్లాయపాళెం గ్రామస్తుడు పి.రామచంద్రారెడ్డి 1983లో ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దీనిని అప్పటి కోవూరు తహసీల్దార్ టి. పార్థసారధి రెవెన్యూ డివిజనల్ అధికారికి సమాచారం ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కాల క్రమేణా కొందరికీ ప్రభుత్వం మంజూరు చేసింది. వారిలో జె.మల్లికార్జునకు చెందిన 90 సెంట్లు, వి.రమణయ్యకు చెందిన 92 సెంట్లలో తవ్వకాలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్న సంస్థ, సర్వే పరిధిలోలోని మిగతా భూమిలో తవ్వకాలు జరుపుతోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సర్వే నంబరు 1034లో అనుమతికి మించి, అనుమతి లేని భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై స్థానికులు తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. జరుగుతున్న పరిస్థితులను వివరించారు. సర్వే జరుపుతామని తప్పకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే ప్యాకేజీ అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ వైపు వెళ్లిన దాఖలాలు లేవు. లోకాయుక్తకు ఫిర్యాదు అనుమతికి మించి, అనుమతి లేని చోట తవ్వకాలు జరగడంపై స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో తహసీల్దార్, మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చనున్నామన్నారు. కళ్ల ముందు అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్‌పై అటు రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ధనానికి గండికొట్టి అక్రమంగా సహజవనరులను దోచుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ జానకిని కోరుతున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : వెంకటేశ్వర్లు, ఆర్డీఓ అనుమతి మేరకు తవ్వకాలు జరపాలి. స్థానిక వీఆర్వోను సంఘటన స్థలానికి పంపుతాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.