తవ్వేస్తున్నారు
-
ప్రభుత్వ భూమిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు
-
అనుమతి ఓ చోట, తవ్వకాలు మరో చోట
-
గడువు పూర్తయినా ఆగని తవ్వకాలు
-
మామూళ్లమత్తులో రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారులు
-
ఒక్కొక్కరికీ ఒక్కో ప్యాకేజీ
అక్రమార్కులు కొందరు సహజవనరులను కొల్లగొడుతున్నారు. గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అధికారులకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అనుమతి ఓ చోట పొంది, మరోచోట తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతి గడువు పూర్తయినా ఆగలేదు. రెవెన్యూ, విజిలెన్స్, మైనింగ్ అధికారుల అండదండలతో ప్రభుత్వ భూమిలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ సహజనవనరులను దోచుకుంటున్న వైనంపై కథనం.
బుచ్చిరెడ్డిపాళెం : కొడవలూరు మండలంలో గ్రావెల్‌దందా మితిమీరింది. యల్లాయపాళెం రెవెన్యూ పరిధిలోని రామాపురంలో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. కార్తికేయ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ గ్రావెల్ కావాలని జిల్లా మైన్స్ అండ్ జియాలజీ విభాగాన్ని కోరింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు స్థానిక తహసీల్దార్ ద్వారా పంపింది. వీటిని పరిశీలించిన జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రావెల్ రవాణాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 2016 మే 11వ తేదీన మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్ మే 12న సర్వే నంబరు 1034లో జె.మల్లికార్జునకు చెందిన 90 సెంట్లు, వి.రమణయ్యకు చెందిన 92 సెంట్లలో 4330 క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను రెండు నెలల్లో తీసుకోవాల్సిందిగా అనుమతి ఇచ్చారు.
జరుగుతోందిలా...
సర్వే నంబరు 1034లో నేటికీ దాదాపు ఆరు ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపారు. అనుమతికి మించి 50వేల క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. గడువు ముగిసి ఎనిమిది రోజులు దాటుతున్నా నేటికీ తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. మానిటరింగ్ చేయాల్సిన మైన్స్ అండ్ జియాలజీ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతో ఇష్టారాజ్యంగా గ్రావెల్ తరలుతోంది.
సీలింగ్ భూమిలో తవ్వకాలు
సర్వే నంబరు 1034లో 11.16 సెంట్లు సీలింగ్ భూమి ఉంది. ఈ భూమిని యల్లాయపాళెం గ్రామస్తుడు పి.రామచంద్రారెడ్డి 1983లో ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. దీనిని అప్పటి కోవూరు తహసీల్దార్ టి. పార్థసారధి రెవెన్యూ డివిజనల్ అధికారికి సమాచారం ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూమిని కాల క్రమేణా కొందరికీ ప్రభుత్వం మంజూరు చేసింది. వారిలో జె.మల్లికార్జునకు చెందిన 90 సెంట్లు, వి.రమణయ్యకు చెందిన 92 సెంట్లలో తవ్వకాలు చేసేందుకు అనుమతి తెచ్చుకున్న సంస్థ, సర్వే పరిధిలోలోని మిగతా భూమిలో తవ్వకాలు జరుపుతోంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
సర్వే నంబరు 1034లో అనుమతికి మించి, అనుమతి లేని భూముల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై స్థానికులు తహసీల్దార్ వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేశారు. జరుగుతున్న పరిస్థితులను వివరించారు. సర్వే జరుపుతామని తప్పకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే ప్యాకేజీ అందుకున్న రెవెన్యూ అధికారులు ఆ వైపు వెళ్లిన దాఖలాలు లేవు.
లోకాయుక్తకు ఫిర్యాదు
అనుమతికి మించి, అనుమతి లేని చోట తవ్వకాలు జరగడంపై స్థానికులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో తహసీల్దార్, మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ చేర్చనున్నామన్నారు. కళ్ల ముందు అక్రమంగా తరలిపోతున్న గ్రావెల్‌పై అటు రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ ధనానికి గండికొట్టి అక్రమంగా సహజవనరులను దోచుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కలెక్టర్ జానకిని కోరుతున్నారు.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం : వెంకటేశ్వర్లు, ఆర్డీఓ
అనుమతి మేరకు తవ్వకాలు జరపాలి. స్థానిక వీఆర్వోను సంఘటన స్థలానికి పంపుతాం. విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.