ఆగని అక్రమాలు.. | Sub Registrar Officers Demanding Bribe In Yadadri | Sakshi
Sakshi News home page

ఆగని అక్రమాలు..

Published Fri, Jun 28 2019 11:11 AM | Last Updated on Fri, Jun 28 2019 11:11 AM

Sub Registrar Officers Demanding Bribe In Yadadri - Sakshi

యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు (ఫైల్‌)

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఏసీబీ అధికారులు దాడులు చేసినా.. ప్రైవేట్‌ వ్యక్తులను విధుల్లోంచి తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా, కార్యాలయాల సమయంలోనే విధులను నిర్వహించాలని చెప్పినా.. లంచాలు వసూలు చేయొద్దని ఆదేశించినా..అధికారుల తీరు మారడం లేదు.

డాక్యుమెంట్‌ రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా దోపిడీపర్వం కొనసాగిస్తున్నారు. జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఇదే అదనుగా కార్యాలయాల్లో అక్రమాలకు అంతులేకుండా పోయింది.

నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో డాక్యుమెంట్‌ రైటర్ల పెత్తనం పెచ్చుమీరి పోతోంది.  వీరికి సబ్‌రిజిస్ట్రార్లతోపాటు అందులో పనిచేసే సిబ్బంది వారు నియమించుకున్న ప్రైవేట్‌ సిబ్బంది పూర్తి అండదండలు అందిస్తున్నారనేది బహిరంగ సత్యం. 

‘ఏసీబీ’ తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలు..
భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇటీవల అక్రమాలు వెలుగు చూశాయి. యాదగిరిగుట్ట కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల్లో రిజిస్ట్రేషన్‌ల సందర్భంగా జరుగుతున్న అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడ్డాయి. వందలాది డాక్యుమెంట్లు నిబంధనలకు విరుద్ధంగా సబ్‌రిజిస్ట్రార్‌ వద్ద పెండింగ్‌లో ఉండడం ఇక్కడ కొసమెరుపు.

రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు చేస్తూ బీబీనగర్‌ అధికారుల ఉదాంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది. గతంలో భువనగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ అనుచరులు ఆక్రమించిన బినామీ భూములను జిరాక్స్‌ కాపీలతో రిజిస్ట్రేషన్‌ చేస్తూ రిజిస్ట్రార్‌ జైలుకు వెళ్లారు. ఇలా జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో అడ్డూఅదుపు లేకుండా అక్రమాల పర్వం జోరుగా సాగుతోంది.  

పలు కార్యాలయాల్లో అక్రమాల జాతరే..
భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, బీబీనగర్, చౌటుప్పల్, మోత్కూర్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అక్రమాల జాతర కొనసాగుతోంది. ఆయా కార్యాలయాల చుట్టూ డాక్యుమెంట్‌ రైటర్లు తమ ఆఫీసులను ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా.. వీటిని తొలగించే ప్రయత్నం ఎవరివల్ల కావడం లేదు.

ఎవరైనా రిజిస్ట్రేషన్‌ కోసం వెళ్లగానే అధికారులు వెంటనే డాక్యుమెంట్‌ రైటర్ల వద్దకు పంపిస్తారు. వారి వద్ద నుంచే డాక్యుమెంట్లు, చలాన్‌లు చెల్లిస్తారు. భూమికి ఉన్న విలువను బట్టి ప్లాటు, ఎకరాల్లో రిజిస్ట్రేషన్లకు వంతుల వారీగా డబ్బులు నిర్ణయించి రైటర్లే వసూలు చేస్తారు. ఇక్కడ అంతా రైటర్లదే హవా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన వారి వద్ద డాక్యుమెంట్‌ల వారిగా రేట్లు నిర్ణయిస్తారు. 

సమస్యాత్మక భూములుంటే..
సమస్యాత్మక భూములు ఉంటే వారు అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. లేదంటే డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ కాదని పక్కన పెట్టేస్తారు. రకరకాల కారణాలతో పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్‌ చేస్తుంటారు. సామాన్యుడు నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకునే పరిస్థితి లేదు. లంచం ఇవ్వకపోతే అన్ని సక్రమంగా ఉన్న రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి.

సమస్యలు లేకున్నా సృష్టించి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్న తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఎవరూ పట్టించుకోని దుస్థితి నెలకొంది. అయితే జిరాక్స్‌ కాపీలపై తప్పుడు ధ్రువపత్రాలు, ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేయడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోడాక్యుమెంట్‌ రైటర్లకు డబ్బులు ముట్టిన వెంటనే రిజిస్ట్రేషన్‌ తతంగం అంతా పూర్తి చేస్తారు. ఏరోజుకారోజు వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా సాయంత్రం అధికారులు, ఉద్యోగులు లె క్కలు చూసుకుని వాటాలు పంచుకుని ఇంటికి వెళ్తారు. 

కార్యాలయాల చుట్టూ అద్దె భవనాలు..
భువనగిరి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ.. ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. అలాగే యాదగిరిగుట్టలో కొనసాగుతున్న కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్‌ రైటర్ల కార్యాలయాలు విచ్చలవిడిగా వెలిశాయి.

జిల్లాలో ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం చుట్టూ డాక్యుమెంట్‌ రైటర్లు గదులను అద్దెకు తీసుకుని పాగా వేశారు. కొన్నిచోట్ల ఇతరులకు అద్దె భవనాలు దొరక్కకుండా డాక్యుమెంట్‌ రైటర్లే కార్యాలయాల చుట్టుపక్కల గల భవనాలకు అద్దెలు చెల్లిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. 

రికార్డులు పంపించరు..
నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు పూర్తయిన వెంటనే ఆ డాక్యుమెంట్ల రికార్డులను స్కానింగ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి నేరుగా యజమానికి చేరవేయాలి. కానీ ప్రతి చోట అలా జరగడం లేదు. డాక్యుమెంట్‌ రైటర్లు తాము చేయించిన డాక్యుమెంట్లను రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి తీసుకుని తమ వద్దే ఉంచుకుని పంపిస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. 

బీబీనగర్‌లో రాత్రి పొద్దుపోయే వరకు..
బీబీనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మూడురోజుల క్రితం రాత్రి 10గంటలు దాటిన రిజిస్ట్రేషన్‌ అధికారులు, సిబ్బంది, ప్రైవేట్‌ వ్యక్తులు ఉండడంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్‌ వ్యక్తులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోకి విధి నిర్వహణ కోసం రానీయవద్దని ఇటీవల ఆశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

యాదగిరిగుట్ట, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెద్ద ఎత్తున ప్రైవేట్‌ వ్యక్తులు డాక్యుమెంటర్ల అనుచరులు ఏసీబీకి పట్టుబడ్డారు. పలు అవకతవకలకు కారణం అవుతున్న ప్రైవేట్‌ సిబ్బందిని ఎట్టి పరిస్థితిలో కార్యాలయంలోకి అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించిన సమయంలోనే విధి నిర్వహణ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయినప్పటికీ రాత్రి పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్‌ కొనసాగడం వెనుక పెద్ద ఎత్తున అక్రమాలేనని ఆరోపణలు ఉన్నా యి. అయితే మధ్యాహ్నం సర్వర్‌ పని చేయకపోవడం వల్లే అనుమతి తీసుకుని పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్‌లు చేశామని అధికారులు సంజాయిషీ ఇస్తున్నారు. 

తారస్థాయికి చేరిన అవినీతి..
భువనగిరి, బీబీనగర్, రామన్నపేట, యాదగిరిగుట్ట, మోత్కూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయిలో కొనసాగుతోంది. జిల్లాలో భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగిపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్లాట్లు, భూములు, రిజిస్ట్రేషన్‌లు జరుగుతున్నాయి. ఈక్రమంలో రియల్టర్లు తొందరగా పని పూర్తి చేయడం, కొన్నిచోట్ల ప్రభుత్వ భూములు, సమస్యాత్మక భూములు రిజిస్ట్రేషన్‌లు చేయించడం కోసం పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజేబుతున్నారు. 

యాదగిరిగుట్టలో.. 
యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన తరువాత ఇక్కడ పని చేసిన సబ్‌ రిజిస్ట్రార్‌ వాహిద్‌ను నల్లగొండకు బదిలీ చేశారు. ఆయన స్థానంలో హుజూర్‌నగర్‌ నుంచి సైదులును ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌గా నియమించారు. ఆయన తరువాత హైదరాబాద్‌ నుంచి జహంగీర్‌  వచ్చారు. ఆయన్ని కూడా మార్చి ప్రస్తుతం దేవరకొండ నుంచి శ్రీనివాస్‌రావును సబ్‌ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తున్నారు. వీరితోపాటు  ముగ్గురు అధికారులను బదిలీ చేశారు. ఇప్పటికే పదిరోజుల వ్యవధిలో జిల్లా రిజిస్ట్రార్, ఆడిట్‌ డీఆర్‌లు తనిఖీలు చేశారు.  

అన్ని సక్రమంగా ఉన్నా.. 
పైచిత్రం యాదగిరిగుట్టలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం. ఇటీవల రాజాపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమకు వారసత్వంగా వచ్చిన ఇల్లు, భూమిని భాగాలుగా విభజించుకుని రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి ఇక్కడకి వచ్చారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న డాక్యుమెంట్‌ రైటర్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజుతోపాటు అదనంగా మరో రూ.20వేలు అధికారులకు చెల్లించాలని తెలిపారు. దీంతో సదరు వ్యక్తులు ఆశ్చర్యపోయారు.

అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయి కదా ఎందుకు చెల్లించాలని అడగ్గా తనకేమీ తెలియదని అంతా రిజిస్ట్రార్‌ ఆదేశాల మేరకు జరుగుతుందని సదరు రైటర్‌ సెలవిచ్చారు. అయితే అంత మొత్తంలో డబ్బు లేకపోవడంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండానే అక్కడనుంచి వెనుదిరిగిపోయారు. యాదగిరి గుట్టలో ఒక్కచోటే కాదు జిల్లాలోని ప్రతి సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోనూ ఇదే తతంగం కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement