ద్రోన్ల హోరు - సర్వేల జోరు
ఇటుక ముక్కకు గతి లేదు రామా హరి
ఇంద్రుని రాజధాని కడతాము కాదా మరి
ఈ బ్రిక్కు, ఆ బ్రిక్కు, ఏ బ్రిక్కు అయినా సరి
ఆ నగర మేడలకు ఇటుకలే విటమిన్లు కృష్ణా హరి
కళ్ళు మనవైనాను, ఊళ్ళు మనవైనాను రామా హరి
చూసేటి అద్దాలు ఆ సింగపూరే ఇవ్వాలి సరాసరి
రైతునెరగని వారు, పంట చూడని వారు సై సింగపూరు
దిగుమతులే బతుకుగా రోజు గడిపే వారు సై సింగపూరు
మన నేల మన నీరు, మన చెట్టు, మన గాలి అతి వింతలూర
చూపుతారట త్రీ-డీ బొమ్మలుగా ఇక కరువు తీర
భూమికి భూమంటూ చేసే పరిహార పథకాల అమలు
వారి డ్రోన్ లెగిరితే గాని తెలియదంట మన నేల మనకు
సర్వేలు, రికార్డులు, రెవెన్యూ నిపుణులున్నా సై సింగపూరు
డ్రోన్ లెగురకపోతే మన నేల తీరేదో మనకే తెలియదన్నారు
తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి ఆకాశాల ఎగిరింది డ్రోనూ
జీను లేని గుర్రమది ఎగిరింది వివరాలకేనంట అవునూ
వివరాలది ఏర్చి తీర్చాక రావయ్యా ఓ పొలమిచ్చిన రైతన్న
డ్రోన్ చూపిన నేల నీకు కేటాయింపౌనూ గొప్పగా ఓరన్న
హై టెక్కు పాలనలో, తైతక్క పద్ధతిలో రామా హరి
ఎంత డ్రోన్‌కు అంత కూలి ఎరగాలి జనులు కృష్ణా హరి
డ్రోన్ చూపితే గాని మనం మండలాలను మనమెరుగలేమా
డ్రోన్ చూపితే గాని ఏ భూమి పరిహార అర్హమో తీర్పలేమా
ఇది భూకంప జోన్ అన్నకృష్ణ సంఘంకన్నా తెలివైనదా డ్రోన్
జవాబు చెప్పరెవరు రాజధాని వయ్యారాల సింగపూరు సిద్ధాంతులు
సరదాల దసరాల పాట -అయ్యవారికి చాలు అయిదు వరహాలు
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు పాట పాత బడ్డది రామా హరి
రాజధాని కొసకు సింగపూరు అయ్యవారు
ఇచ్చేటి బిల్లు కృష్ణా హరి
పండుగ దండగలా దాటి పోవును
పదేడు వందల కోట్ల డాలర్లు
పప్పు బెల్లాలైన ప్రజలకు మిగులునో లేదో
ఈ రాజధాని హోరులో.
(తుళ్ళూరు, మంగళగిరి, తాడేపల్లి మూడు మండలాలో్ల, సింగపూర్ కంపెనీ డ్రోన్లు సర్వేలు జరిపి, పంట భూములిచ్చిన రైతులకివ్వవలసిన పరిహార భూమిని నిర్ణయించడంలో కీలక పాత్ర
పోషిస్తున్నాయి అన్న వార్తలు చదివాక).
- రామతీర్థ 98492 00385