రామమందిరం కోసం ట్రక్కు ఇటుకలతో వచ్చి..
అయోధ్య: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం విషయంలో సామరస్యపూర్వకమైన పరిష్కారం తప్పకుండా లభిస్తుందని అనుకుంటుండగా కొంతమంది ముస్లిం కరసేవకులు రామమందిరం నిర్మాణం పేరిట వచ్చి హల్చల్ చేశారు. ముస్లి కరసేవక్ మంచ్(ఎంకేఎం) పేరిట ఒక బ్యానర్ ఓ ట్రక్కుకు కట్టుకొని దాని నిండా ఇటుకలు పేర్చుకొని అయోధ్యలోకి అడుగుపెట్టారు. రామమందిరం నిర్మాణం కోసం అని చెబుతూ జై శ్రీరాం అంటూ నినాదాలతో దారి పొడవునా హోరెత్తించారు.
ఎంకేఎం అధ్యక్షుడు ఆజం ఖాన్ దీనిపై స్పందిస్తూ తాము రామమందిర నిర్మాణానికి సహాయం చేయాలని అనుకున్నట్లు తెలిపాడు. మరికొందరు మాట్లాడుతూ లక్నోలోని ఓ బస్తీ, వివిధ జిల్లాల నుంచి ఆలయం నిర్మాణంకోసం ఇటులతో వచ్చినట్లు చెప్పారు. అయితే, అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి వెనక్కు పంపించేశారు. అనంతరం ఆ ప్రాంతంలోకి అనుమతించకుండా ఒక రోజంతా తాళం వేశారు. అయితే, తాము తీసుకొచ్చిన ఇటుకలను తీసుకొని భద్రంగా పెట్టాలని స్థానిక విశ్వహిందూ పరిషత్ సభ్యులను కోరినట్లు తెలిసింది. గతంలో కూడా రామమందిరం నిర్మాణానికి అనుకూలంగా ఆజంఖాన్ లక్నోలో పోస్టర్లు పెట్టి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.