గోవాకు ఆలస్యంగా చేరుకున్న పుతిన్
పనాజీ : దట్టమైన పొగమంచు కారణంగా బ్రిక్స్ సమావేశానికి హాజరుకానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆలస్యంగా గోవాకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు షెడ్యూల్ ప్రకారం దాబోలిమ్ విమానాశ్రయం ప్రక్కన ఉన్న ఐఎన్ఎస్ హన్సా బేస్కు ఆయన రాత్రి 1 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలో దట్టమైన పొగమంచు కమ్ముకుని ఉండటంతో రష్యా అధ్యక్షుడి విమానం ల్యాండ్ అవడానికి ఆలస్యమైనట్టు నావెల్ బేస్ ప్రకటించింది. మొదటి తెల్లవారుజామున మూడు గంటలకు విమానం ల్యాండ్ అవుతుందని భావించారు. అనంతరం ఆ సమయాన్నిరీషెడ్యూల్ చేసి ఏడు గంటలకు మార్చారు. ఎట్టకేలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ విమానం దాబోలిమ్ విమానాశ్రయానికి ఉదయం10 గంటల ప్రాంతంలో చేరుకుంది. గోవాకు చేరుకున్న అనంతరం పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. బ్రిక్స్ సమావేశానికి హాజరుకావడానికి ముందు వీరిద్దరూ కాసేపు ముచ్చటించారు.
ఐఎన్ఎస్ హన్సా బేస్ నుంచి బ్రిక్స్ సమావేశం జరిగే బెనాలియం గ్రామంలోని హోటల్ ప్రాంతం వరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రష్యా ప్రెసిడెంట్ను గ్రాండ్గా స్వాగతించడానికి గత రాత్రే పలువురు కేంద్రమంత్రులు, గోవా అధికార ప్రతినిధులు బేస్ ప్రాంతంలో క్యాంపెయిన్ నిర్వహించారు. భారత్ అధ్యక్షతను ఈ సారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గోవాలో జరుగుతోంది. కాగ ఈ సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోదీ నిన్న రాత్రే గోవా చేరుకున్నారు. దక్షిణాఫ్రికా జాకుబ్ జుమా, బ్రెజిల్ అధ్యక్షుడు మిచెల్ టెమర్లు కూడా దాబోలిమ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి భారత ప్రతినిధులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.