breaking news
Britain Citizens
-
బ్రెగ్జిట్‌కు ఓటేసి తప్పు చేశాం!
లండన్: యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలగాలా? వద్దా? అనే అంశంపై జూన్ 23న జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో వైదొలగటానికి (బ్రెగ్జిట్‌కి) అనుకూలంగా ఓటేసినందుకు 23 లక్షల మంది బ్రిటన్ పౌరులు చింతిస్తున్నట్లు ఒపీనియమ్ సర్వే చెప్తోంది. బ్రెగ్జిట్‌లో ఈయూను వీడాలంటూ ఓటేసిన వారిలో 7 శాతం మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. తమకు మళ్లీ అవకాశం ఉంటే ఈయూలో కొనసాగాలని ఓటేస్తామన్నారు. అంటే.. బ్రెగ్జిట్ ఫలితాల్లో అనుకూలంగా పోలైన ఓట్ల నుంచి ఈ 23 లక్షల మంది ఓట్లను తీసేస్తే.. ఆ ఫలితాలు తారుమారవుతాయి. అలాగే.. ఈయూలో కొనసాగాలంటూ ఓటేసిన వారిలో సైతం మూడు శాతం మంది దానిపై విచారం వ్యక్తం చే శారు. మరోపక్క.. బ్రె గ్జిట్ ఫలితాల ప్రకటన అనంతరం బ్రిటన్‌లో జాతి విద్వేష పూరిత నేరాలు పెరిగాయి. ఇటువంటి నేరాలకు సంబంధించి గత వారం రోజుల్లో 331 కేసులను బ్రిటన్ పోలీసులు నమోదు చేశారు. -
మతానికి దూరమవుతున్న బ్రిటన్!
లండన్: బ్రిటన్ పౌరుల్లో అత్యధికులు ఏ మతాన్నీ అనుసరించడం లేదని సర్వేలో తేలింది. ‘యుగోవ్’ సంస్థ గత నెల ఈ సర్వేను నిర్వహించింది. ఇటీవలి కాలంలో బ్రిటన్‌కు వచ్చినవారి(ఇమ్మిగ్రెంట్స్)తోసహా దేశవ్యాప్తంగా 1,500 మందిని ప్రశ్నించింది. వీరిలో దాదాపు సగం మంది(46 శాతం) తాము ఏ మతాన్నీ పాటించట్లేదన్నారు. 2015 ఫిబ్రవరిలో సర్వే చేసినప్పుడు వీరి సంఖ్య 42 శాతం. అదే 2013 జనవరిలో సర్వే జరిపినప్పుడు ఈ సంఖ్య 37 శాతమే. ఇక బ్రిటిష్ జాతీయుల(తెల్లవారి)లో ఇది 50 శాతానికిపైగా నమోదైనట్లు సండే టైమ్స్ తెలిపింది. దేవుడుగానీ, ఇంద్రియాతీతమైన శక్తిగానీ లేదని నమ్మేవారి సంఖ్య బ్రిటన్‌లో పెరుగుతుండగా.. అందులో 40 ఏళ్లలోపువారు ఎక్కువగా ఉన్నారు. అన్ని జాతుల్లోని 40 ఏళ్లలోపున్న వారిలో 56 శాతం మంది తమకు ఎటువంటి మతం లేదని పేర్కొన్నట్టు సర్వేలో వెల్లడైంది. అయితే వీరిలో ఆరో వంతు మంది(16.5 శాతం) తమకు ఎటువంటి మతం లేదని చెబుతూనే.. ఏదో ఒక అతీతశక్తి మనల్ని నడిపిస్తున్నదని మాత్రం విశ్వసిస్తున్నట్టు చెప్పారు. 13 శాతం మంది మాత్రం మతానికి తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.